దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దొంగల అరెస్టు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో సీఐలు హరినాథ్‌, నీలకంఠేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మారెంపల్లి కాలనీకి చెందిన బోయ నరసింహ, బోయ మధుసూదన్‌, ఒంటిమిద్దికి చెందిన పిట్టి తిప్పేస్వామి, పార్వతీనగర్‌ కు చెందిన బలిజ అచ్చయ్యలు బెట్టింగ్‌, ఇతర చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టారు. మారెంపల్లి, పార్వతీ నగర్‌, ఒంటిమిద్దిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ చొరబడి బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురూ స్థానిక అక్కమ్మ గార్ల బస్‌ స్టాప్‌ వద్ద ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నెక్లెస్‌, గొలుసు, ఉంగరాలు, చెవి కమ్మలు, చైన్‌తో పాటు 129.6 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసకున్నట్లు సీఐలు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

ఉరి వేసుకొని

యువకుడి ఆత్మహత్య

కూడేరు: చెట్టుకు ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని అరవకూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అరవకూరుకు చెందిన శ్రీరాములు కుమారుడు అశోక్‌ (22) బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న అగ్రిగోల్డ్‌ వెంచర్‌లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింటి వారితో జరిగిన గొడవ నేపథ్యంలో వారు మందలించడంతో మనస్తాపం చెంది తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని తండ్రి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సస్యరక్షణతో మల్బరీలో అధిక దిగుబడులు

ధర్మవరం రూరల్‌: మల్బరీ సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చునని అనంతపురం పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ వీఎస్‌ రమ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రేగాటిపల్లిలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీలో సమగ్ర కీటక, వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు శోభారాణి, ధర్మవరం సహాయ సంచాలకురాలు రాజేశ్వరి, పట్టు అభివృద్ధి అధికారి దామోదర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేలలో సేంద్రియ కార్బన్‌ శాతాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. వేరు కుళ్లు వ్యాధి సమగ్ర నివారణకు సాఫ్‌ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల అడుగు భాగంలో ద్రావణాన్ని పోయాలన్నారు. 10 రోజుల వ్యవధిలో మరో సారి కూడా పోయాలన్నారు. మూడో విడవ విడతలో మిస్టర్‌ ప్రో లీటర్‌ నీటికి 5 మి.లీ కలిపి వ్యాధి సోకిన ప్రతి మొక్కకు 10 లీటర్ల ద్రావణం, అలాగే ఆరోగ్యకరమైన ప్రతి మొక్కకు 5 లీటర్ల ద్రావణాన్ని నేలపై పోయాలన్నారు.

జిల్లా జట్టు జయ కేతనం

అనంతపురం: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌ –23 ఉమెన్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు 82 పరుగులతో ఘన విజయం సాధించింది. అనంతపురం, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంతపురం 49 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. పి. మహిత 74 పరుగుల్లో 80 పరుగులు (10 ఫోర్లు), ఏ.హన్సి రెడ్డి 51 బంతుల్లో 56 పరుగుల (8 ఫోర్లు)తో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 214 పరుగులు సాధించింది. దీంతో అనంతపురం జట్టు 82 పరుగులతో విజయం సాధించింది. బౌలర్‌ తరుణం నాలుగు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

అవార్డుల ప్రదానం

గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేసిన పలువురు ఉద్యోగులకు మంగళవారం మ్యాన్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డులను డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా ప్రదానం చేశారు. ఎర్రగుంట్లకు చెందిన ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసులు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందప్ప, కానిస్టేబుల్‌ ఎస్‌. వెంకటరెడ్డితోపాటు గుంతకల్లు ట్రైనీ మేనేజర్‌ సురేష్‌బాబు, పాయింట్స్‌మెన్‌లు జ్యోతీ ప్రతాప్‌ (ఎర్రగుడిపాడు), వై.పురుషోత్తం (గుత్తి), ఎం. శ్రీహరి (స్టేషన్‌ మాస్టర్‌, అనంతరాజుపేట), మల్లేషన్‌ (టెక్నీషియన్‌–3, మంత్రాలయం)కు అవార్డులు అందజేసి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement