అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో ఏఆర్ విభాగం పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఈ కీలకమైన ఏఆర్ అధికారుల పనితీరు, ఆయా విభాగాల్లో నిధుల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెల్ఫేర్ నిధులు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డీపీఓలో నిర్మిస్తున్న కట్టడాలలో భారీగా అవకతవకలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాలు ఆధునికీకరణ, సిబ్బంది విశ్రాంతి గదుల నిర్మాణంతో పాటు తాత్కాలిక స్పోర్ట్స్ నెట్ ఏర్పాటు తదితర పనుల్లో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ వాటిపై వివరణకు కానీ, విచారణకు గాని ఆదేశించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎంటీ విభాగంలోనూ అవకతవకలు..
మోటార్ ట్రాన్స్‌పోర్టు (ఎంటీ) విభాగంలో అవకతవకలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వాహన మరమ్మతులకు ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే బాధతో ఓ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ (డ్రైవర్) ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇటీవల కూడేరు సీఐ రాజు తన సొంత కారుకు నెలనెలా డీజిల్ వినియోగిస్తున్న వైనం వెలుగుచూసింది. ప్రభుత్వ వాహనం మరమ్మతులకు గురై మూలనకు పెట్టినప్పటికీ వినియోగం ఉందన్నట్లు డీజిల్ డ్రా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పోలీసు పెట్రోల్ బంకులో ఓ అధికారికి అనుకూలంగా ఉన్న సిబ్బందిని నియమించుకొని డీజిల్ లావాదేవీల్లో అవకతవకలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారుల ఇంటి పనులకు హోంగార్డులు..
అనేకమంది హోంగార్డులు, కొంతమంది ఏఆర్ కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ అధికారి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం.. తీసుకురావడం లాంటి పనులు చూసుకునేందుకు ఆరుగురు హోంగార్డులను పెట్టుకున్నట్లు తెలి సింది. ఏఆర్ విభాగం పర్యవేక్షిస్తున్న అధికారి ఇంట్లో పలువురు సిబ్బందిని పనిమనుషులుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ప్రతి ఆర్‌ఐకూ సొంత పనులు చేసేందుకు హోంగార్డులను నియమించుకున్నారని తెలిసింది. ఇటీవల ఓ విభాగానికి వచ్చిన జిల్లా అధికారి ఇంటికి ఆరుగురు, ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి ఇంటి పనులకు కూడా హోంగార్డులను పంపుతున్నట్లు తెలిసింది. ఎవరైనా ఆ పనులకు వెళ్లం అంటే బదిలీ చేస్తామని, సుదూర ప్రాంతాలకు బందోబస్తు వేస్తామని, జీతాల్లో కోత పెడతామని బెదిరిస్తున్నట్లు తెలిసింది.
గాడి తప్పిన ఏఆర్ పాలన
అన్ని విభాగాల్లోనూ ఇష్టారాజ్యం


