కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వెంకటంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. వెంకటంపల్లి నడిబొడ్డున ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 30 తులాల వెండి కిరీటం, 20 తులాల వెండి మలతాడు, హస్తం ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఉన్నా వాటికి చిక్కకుండా చోరీకి పాల్పడటం గమనార్హం. దీనిపై మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
సద్దుమణిగిన గొడవ
పుట్టపర్తి అర్బన్: వైద్యులు, ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న గొడవ ఎట్టకేలకు సద్దుమణిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వైద్యులు, ఉద్యోగ సంఘాలకు మధ్య గొడవలు మంచిది కాదంటూ బలవంతంగా సారీ చెప్పించి ఒప్పించడం గమనార్హం. తనను ఉద్యోగ సంఘాల నాయకులు లింగా రామమోహన్, మరో వ్యక్తి చంపుతానని బెదిరించారంటూ పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఆస్పత్రి వైద్యుడు దిలీప్ కుమార్ సోమవారం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం స్టాఫ్ నర్సులతో మొదలైన గొడవ చంపుతామంటూ బెదిరించే వరకూ వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టర్ దిలీప్ కుమార్‌పై కేసు నమోదు చేయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. దీనిపై మంగళవారం రాత్రి డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం దిలీప్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడారు. డాక్టర్‌కు ఉద్యోగ సంఘాల నాయకులతో సారీ చెప్పించడంతో ఆయన చల్లబడ్డారు.
పిల్లలను హెచ్‌ఎం కొడుతోందని టవరెక్కిన తండ్రి
తలుపుల: తన పిల్లలను పాఠశాల హెచ్‌ఎం నిత్యం కొడుతోందంటూ ఓ తండ్రి సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని పెద్దన్నవారిపల్లికి చెందిన ఓబులపతి పిల్లలు వర్షిత, శశివర్దన్‌లు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. స్కూల్ హెచ్‌ఎం హేమలత రోజూ వీరిని కొడుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్రాముడుకు ఓబులపతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం స్థానిక ఓబీఆర్ రోడ్డులోని సెల్ టవర్ ఎక్కాడు. ఏఎస్‌ఐ వెంకటగిరి, కానిస్టేబుల్ రమేష్‌లు అక్కడికి చేరుకుని ఓబులపతికి నచ్చజెప్పి కిందికి దించారు. స్టేషన్‌లో ఎస్‌ఐ చెన్నయ్య కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.


