యువత కలలను ఛిద్రం చేశారు | - | Sakshi
Sakshi News home page

యువత కలలను ఛిద్రం చేశారు

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే యువత కలలను ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఛిద్రం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. మెగా డీఎస్సీ అంటూ అనర్హులకు పోస్టులు కేటాయించి.. అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టి.. మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలని శుక్రవారం పార్టీ నేతలు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే విద్యాశాఖ తొలుత విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌, డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకానికి సంబంధించి బేరాలు జరిగిన వీడియోతో కూడిన ఆధారాల పెన్‌డ్రైవ్‌ను కూడా సమర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉన్నా మంత్రి లోకేష్‌తో పాటు అధికార పార్టీ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.9,500 కోట్లతో పాటు తక్షణం విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు వెంటనే భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సమగ్ర విచారణ చేపట్టాలి

మాజీ మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలు, బాధిత అభ్యర్థులు వెల్లడించిన అంశాలు, బయటకు వచ్చిన అంశాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేశాయన్నారు. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు చూపుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం నిరుద్యోగులను ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో ఘోర తప్పిదాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించిందన్నారు. అందుకే నెలన్నరక్రితం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు.

ప్రతిభ లేని వారికి పట్టం కట్టారు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్‌ కోటా పేరుతో ప్రతిభ లేని వారికి, అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, ఇందుకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు బోరెడ్డి నరేష్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు లోకేష్‌ బాధ్యత వహించాల్సిందేనన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ యువత భవిష్యత్తుతో ప్రభుత్వ చెలగాటం ఆడుతోందని విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్ధుల్లో నైరాశ్యం నెలకొందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి,, పార్లమెంట్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, వీరా రామకృష్ణారెడ్డి, యుజవన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వెన్నం శివారెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, గోకుల్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్‌ మహమ్మద్‌ వసీం, నాయకులు ఎద్దుల అమర్‌నాథరెడ్డి, ఎస్సీ సెల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా భేగ్‌, వేముల నదీం, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి ఓబిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కైలాష్‌, సంపంగి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ నియామకాల్లో అర్హులకు అన్యాయం

అక్రమాలకు లోకేష్‌ నైతిక బాధ్యత వహించాలి

తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా నేతల డిమాండ్‌

జేసీకి వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement