అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై స్కీమ్ వర్కర్లు ఉద్యమించారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీ, వీఓఏ, మెప్మా ఆర్పీలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు తరలివచ్చారు. న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి నాగమణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు ప్రమీల మాట్లాడారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత మేరకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మానసిక ఒత్తిళ్లకు గురిచేసేలా సంబంధం లేని విధులు అప్పగించడం నిలిపివేయాలన్నారు. నవచేతన యాప్‌ల పేరుతో మోపుతున్న అదనపుభారాన్ని తప్పించాలన్నారు. పింఛను, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. స్కీమ్ వర్కర్లకూ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను చాంబర్‌లో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహన భోజన పథకం వర్కర్ల సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, మెప్మా ఆర్‌పీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, లక్ష్మీదేవి, వీఓఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తిరుపాలు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


