హత్య కేసు ఛేదింపు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు ఛేదింపు

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కళ్యాణదుర్గం రూరల్‌: వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. అరెస్ట్‌ వివరాలను డీఎస్పీ రవిబాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కళ్యాణదుర్గంలోని వడ్డే కాలనీకి చెందిన రఘు అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం కాలనీలోనే నివాసముంటున్న ఈడిగ లక్ష్మిదేవి అనే వృద్దురాలిని జూన్‌ 30న పట్టపగలే హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కొల్లాపురం గుడివద్ద ఉన్న నిందితుడు రఘును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి 2.6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు విద్యార్థినుల గొంతు కోసేందుకు యత్నం

తోటి విద్యార్థిని ఘాతుకం

విడపనకల్లు మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో దారుణం

విడపనకల్లు: విడపనకల్లు మోడల్‌ స్కూల్‌ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్‌ బాష కుమార్తె సోఫియా స్థానిక మోడల్‌ స్కూల్లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్‌ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్‌ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్‌ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలపలేదు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్‌ స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్‌ నల్లమ్మపై మండిపడ్డారు. ఇందుకు వార్డెన్‌.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా! ఏదో చిన్న గీత పడింద’ంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్లేడుతో కోయడంతో విద్యార్థినుల గొంతు కింద పడిన గాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement