● కలెక్టర్ ఆనంద్
రాప్తాడు రూరల్: క్రీడా అవకాశాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం అమరావతి చాంపియన్‌షిప్–2026 మండలస్థాయి బాలబాలికల క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, గ్రామీణ స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తోందన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే శారీరక, మానసిక వికాసంతో పాటు ఉన్నత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాలలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం పూర్తి చేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. అనంతపురం రూరల్ మండలంలోని 12 పాఠశాలల నుంచి 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కలెక్టర్ ప్రోత్సాహంతో చియ్యేడు జెడ్పీ పాఠశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ, ఆర్డీటీ, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అండర్–14 బాలురు, బాలికల విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, ఆర్‌ఐ సందీప్, సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి పాల్గొన్నారు.


