అదుపు తప్పిన బైకు.. వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన బైకు.. వ్యక్తి దుర్మరణం

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

వజ్రకరూరు: మండల పరిధిలోని పీసీ ప్యాపిలి సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద బుధవారం సాయంత్రం కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వజ్రకరూరు పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం పులగుట్టపల్లికి చెందిన కురుబ అయ్యంగారి శివశంకర్‌ (40) ఉరవకొండ మండలం బూదగవి వద్ద నాలుగు ఎకరాలు కౌలు చేస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం బూదగవికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్వగ్రామం పులగుట్టపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో తీవ్రగాయాలైన శివశంకర్‌ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, ఏఎస్‌ఐ రమేష్‌ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లలిత, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ధనుష్‌ అదుర్స్‌

అనంతపురం: సౌత్‌ జోన్‌ సీనియర్‌ పురుషుల అంతర జిల్లా క్రికెట్‌ టోర్నీ బుధవారం ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌లో అనంతపురం, కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు ఇలా మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. బుధవారం కడప, అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కడప పది వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ధనుష్‌ మర్తాల అద్భుతమైన సెంచరీ (127 బంతుల్లో 174 పరుగులు)తో మెరిశాడు. అనంతరం అనంతపురం జట్టు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.

● చిత్తూరు, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు పది వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement