కొనసాగుతున్న ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను బుధవారం నాటికి 1608.70 అడుగులతో 35.09 టీంఎసీల నీరు నిల్వ ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. 14,614 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 3,691 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.

గుంతకల్లులో

మరో కరోనా కేసు

గుంతకల్లు: గుంతకల్లులో మరో కరోనా కేసు నమోదైంది. ఓ రైల్వే ఉద్యోగి భార్య జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బుధవారం రైల్వే డివిజనల్‌ ఆస్పత్రికి వెళ్లింది. దీంతో వైద్యులు ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమె భర్తకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు. అధికారులు రైల్వే ఆస్పత్రికి చేరుకుని ఆమెకు మరోసారి ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయడానికి అవసరమైన శాంపిల్స్‌ తీసుకెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరుకుంది.

ఓటీపీ చెప్పండి ‘సర్‌’

‘మై టీడీపీ’ యాప్‌లో నిర్ధారణ పేరుతో ఓటర్లకు కాల్స్‌

ఓటీపీ అడుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

రాప్తాడు రూరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఫోన్లు చేస్తూ ఓటీపీలు అడుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము సచివాలయ సిబ్బంది, బీఎల్‌ఓలమంటూ పరిచయం చేసుకుని, ఓటరు వివరాల నిర్ధారణ పేరుతో మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని కోరుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. మూడు రోజులుగా అనంతపురం రూరల్‌, అర్బన్‌ మండలాల పరిధిలో పలువురికి ఈ తరహా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా సేకరించిన ఓటర్ల వివరాలను ’మై టీడీపీ’ యాప్‌లో నమోదు చేసిన తర్వాత, వాటి నిర్ధారణ కోసం ఫోన్‌లు చేస్తున్నట్లు కాల్‌ చేసిన వ్యక్తులు చెబుతున్నారని సమాచారం. ఓటీపీ చెబితేనే ప్రక్రియ పూర్తవుతుందంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.

సచివాలయ ఉద్యోగుల

పేర్లు చెప్పి నమ్మించే యత్నం

ఓటీపీ చెప్పేందుకు చాలామంది నిరాకరిస్తుండటంతో కాల్‌ చేస్తున్న వ్యక్తులు స్థానిక సచివాలయ ఉద్యోగులు, బీఎల్‌ఓల పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. దీంతో మొదట కొందరు నమ్మినా, అనుమానం వచ్చిన వారు అసలు బీఎల్‌ఓ ఎవరో తమకు తెలుసని, మీరు ఎవరో చెప్పాలని ప్రశ్నించగానే ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. మరికొందరు కాల్‌ చేసిన వ్యక్తులు మాత్రం తమకు పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉందని, ఒక్కసారి ఓటీపీ చెబితే కన్‌ఫర్మేషన్‌ పూర్తవుతుందని బతిమాలుతున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది ఓటీపీ చెప్పేందుకు ముందుకు రావడం లేదు. తమ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఓటరు ధ్రువీకరణ కోసం ఓటీపీలు అడుగుతున్నారా? లేక వ్యక్తిగతంగా కొందరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండోమెంట్‌ ఏసీగా సుధారాణి

అనంతపురం కల్చరల్‌: జిల్లా దేవదాయ శాఖ (ఎండోమెంట్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ)గా సుధారాణి నియమితులయ్యారు. ఇది వరకు ఏసీగా ఉన్న గంజి మల్లికార్జున ప్రసాద్‌ వారం రోజుల కిందట లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం పాఠకులకు విదితమే. ఆ వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఉన్నతాధికారులు జాప్యం చేశారు. ఎట్టకేలకు అనంతపురం గ్రూప్‌ టెంపుల్స్‌–1 ఈఓ, ఉరవకొండ గవిమఠం ఇన్‌చార్జ్‌గా ఉన్న సుధారాణిని సహాయ కమిషనర్‌ (ఏసీ)గా నియమించారు. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement