బీమాకు రేపటి వరకే గడువు | - | Sakshi
Sakshi News home page

బీమాకు రేపటి వరకే గడువు

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

అనంతపురం అగ్రికల్చర్‌: వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాల ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే దశకు చేరుకుంది. శుక్రవారం వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. అసలే ఎల్‌–నినో పరిస్థితులు ఉండటం, నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి జీవనాడిగా భావిస్తున్న ఉద్యానపంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నందున రోజురోజుకూ టెన్షన్‌ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం బీమా కింద పరిహారం ఇవ్వకపోయినా.. ఈసారి ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, మొదట్లోనే కరువు కబళించే పరిస్థితులు ఉన్నందున బీమా ధీమాపై ఆశలు వదులుకోకుండా ప్రీమియం కట్టేందుకు ఎగబడుతున్నారు.

ప్రీమియం కోసం అవస్థలు

బీమా పథకాల కింద నోటిఫై చేసిన 12 రకాల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఫసల్‌ బీమా కింద వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, మిరప పంటలు ఉండగా వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, బత్తాయి, అరటి, టమాటా పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెలాఖరులోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వ్యవసాయశాఖ, ఆర్‌ఎస్‌కేలు, బ్యాంకులు, మీ–సేవ, కామన్‌ సర్వీసు సెంటర్లు (సీఎస్‌సీ) చుట్టూ పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన పంటలు 1.76 లక్షల హెక్టార్లకు 1.13 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న ఈ రెండు రోజుల్లో అంచనా మేరకు ఇంకా 1.50 లక్షల హెక్టార్ల పంటలకు చెల్లించి బీమా పరిధిలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. మరో వారం రోజులు గడువు పొడిగిస్తే కాని రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు.

ప్రభుత్వ తీరుపై మండిపాటు

ఖరీఫ్‌ మొదలైన 40 రోజుల తర్వాత ప్రభుత్వం బీమా పథకాల నోటిఫికేషన్‌ విడుదల చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అప్పటికే బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్స్‌, కొత్త రుణాల పంపిణీ 90 శాతం ముగియడం వల్ల... 70 నుంచి 80 శాతం మంది రైతులు వేరుశనగ పంట కింద రుణాలు తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేసుకున్నారు. అయితే వర్షాభావం, ఇతరత్ర కారణాల వల్ల వేరుశనగ పంట సాగు విస్తీర్ణం కేవలం 20 వేల హెక్టార్లకు పడిపోయింది. వేరుశనగ పంట కింద రుణం తీసుకుని ప్రీమియం చెల్లించినట్లు నమోదు చేసుకున్న రైతులు పొలంలో వేరుశనగ సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు కావాల్సి ఉంది. దీంతో ఇపుడు బ్యాంకులకు వెళ్లి పంట మార్పిడి చేసుకుని.. సాగు చేసిన... సాగు చేయబోతున్న పంటకు ప్రీమియం చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు.

ఎల్‌–నినో పరిస్థితుల్లో బీమాపై ఆశలు పెట్టుకున్న రైతులు

ప్రీమియం కట్టేందుకు బ్యాంకులు, సీఎస్‌సీల వద్దకు పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement