అనంతపురం ఎడ్యుకేషన్: పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా నివసించే కరువు జిల్లాలోనే ’తల్లికి వందనం’ పథకం సగానికి పైగా విద్యార్థులకు దూరమైంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలోని విద్యార్థుల్లో 53.57 శాతం మందిని అనర్హులుగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిజంగా ఇంతమంది అనర్హులా..? లేక కొర్రీలు, సాంకేతిక కారణాల పేరుతో వేలాదిమంది పేద విద్యార్థులను పథకం నుంచి తప్పించారా..అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి.
సగానికి పైగా అనర్హుల జాబితాలోకి..
జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,512 పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 4,12,778 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1,91,636 మందిని మాత్రమే ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులుగా ప్రకటించారు. మిగిలిన 2,21,132 మంది వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో చేరారు. అంటే 46.43 శాతం మంది మాత్రమే అర్హులు కాగా, 53.57 శాతం మంది పథకానికి దూరమయ్యారు.
వేలాదిమందికి జమకాని డబ్బు..
అనర్హుల సమస్య ఒకవైపు ఉంటే, అర్హులుగా ప్రకటించిన వారిలో కూడా వేలాది మందికి ఇంకా నగదు జమ కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన 1,91,636 మంది అర్హుల్లో శనివారం నాటికి 1,49,713 మందికి మాత్రమే నగదు అందింది. ఇంకా 41,923 మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు అందని లబ్ధిదారుల్లో ఎక్కువగా అనంతపురం అర్బన్‌లో 7,451 మంది, కణేకల్లు మండలంలో 2,825 మంది, రాయదుర్గంలో 2,745 మంది, గుంతకల్లులో 2,684 మంది, డి.హీరేహాళ్‌లో 2,558 మంది, గుత్తిలో 2,543 మంది, విడపనకల్‌లో 2,155 మంది, కళ్యాణదుర్గంలో 2,051 మంది ఉన్నారు.
సమాధానం చెప్పేవారే లేరు..
డబ్బులు ఎందుకు జమ కాలేదో, ఎప్పటిలోగా జమ అవుతాయో, అసలు వస్తాయో లేదో చెప్పే పరిస్థితి అధికార యంత్రాంగంలో కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం దొరకక, చివరకు డీఈఓ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా స్పష్టత లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు పథకానికి అర్హత ప్రమాణాలు ఏమిటి, ఎవరిని ఏ ప్రాతిపదికన అనర్హులుగా గుర్తించారు, పెండింగ్‌లో ఉన్న వారికి నిధులు ఎప్పుడు జమ చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
4.12 లక్షల మందిలో
2.21 లక్షల మందికి పథకం దూరం
అర్హుల జాబితాలో ఉన్న
41,923 మందికి అందని డబ్బు
కార్యాలయాల చుట్టూ
తల్లిదండ్రుల ప్రదక్షిణ
సమాధానం ఇచ్చే వారే కరువు
అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఎం.చిరంజీవికి ముగ్గురు పిల్లలు. రాకేష్ 9వ తరగతి, నిహారిక, నిహాల్ 3వ తరగతి. వీరిలో నిహారికకు మాత్రమే తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు జమయ్యింది. తక్కిన ఇద్దరి పిల్లలకు రాలేదు. నిహాల్‌కు గతేడాది అమలు చేశారు. ఈసారి పరిశీలన జాబితాలో ఉంచారు. మరో విద్యార్థి రాకేష్‌కు సంబంధించి సెంట్రల్ షేర్ రూ. 2400, స్టేట్ షేర్ రూ.10,600 అని అర్హత జాబితాలో చూపిస్తోంది. కానీ ఇప్పటి దాకా జమ కాలేదు. ఇలా అర్హుల జాబితాలో ఉండి డబ్బులు జమకాని వారు జిల్లాలో 41,923 మంది ఉన్నారు. వారి తల్లిదండ్రులు రోజూ సచివాలయాలు, విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఎంతమంది ఉంటే..
అంతమందికీ తల్లికి
వందనం పథకం ఇస్తామన్నారు..
ఇప్పుడేమో మొండి చేయి
చూపుతారా..?
మా చేతుల్లో
ఏమీలేదు
రీ సర్వే ఎఫెక్ట్‌తో పథకం దూరం
పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఇటీవల చేపట్టిన రీ సర్వేలో సర్వే నంబర్ 564–ఎ1లోని 1182 ఎకరాల భూమిని ఎల్‌పీఎం నంబర్ 456తో జాయింట్‌గా పెట్టారు. దీంతో ఆ సర్వే నంబర్‌లో భూమి ఉన్న ప్రతి రైతుకూ 1182 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతోంది. నిబంధనల ప్రకారం పదెకరాల్లోపున్న కుటుంబాలు ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులు. ఇక్కడ 1182 ఎకరాలు నమోదు కావడం వల్ల గ్రామంలోని 20 బీసీ, ఎస్సీ కుటుంబాలలోని విద్యార్థులు పథకానికి దూరమయ్యారు. – పుట్లూరు :


