ఆలయ మాన్యమా... ఆక్రమణే ! | - | Sakshi
Sakshi News home page

ఆలయ మాన్యమా... ఆక్రమణే !

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

అనంతపురం కల్చరల్‌: దేవాలయాలకు సంబంధించి విలువైన మాన్యం భూములు కబ్జాకు గురవుతున్నాయి. పరిరక్షించాల్సిన దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అండతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అందినకాటికి ఆక్రమించి.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలో 35,936 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఇందులో 4,846 ఎకరాల మాన్యం కబ్జాకు గురైనట్టు రికార్డుల్లో నమోదైంది. ఇవి కాకుండా మరెన్నో చోట్ల మాన్యం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చాలాచోట్ల అధికార పార్టీ నాయకుల అండతోనే మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

కబ్జాల్లో మచ్చుకు కొన్ని...

జిల్లా కేంద్రం అనంతపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల్లో 254 ఎకరాలకు పైగా మాన్యం ఉంది. అయితే చిన్నజలాలపురంలో 150 ఎకరాలు, బి.కొత్తకోటలో 70 ఎకరాలు, బుక్కరాయసముద్రంలో 4 ఎకరాల మాన్యం భూములు కబ్జాకు గురయ్యాయి. గూగూడులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయ పరిధిలోని 150 ఎకరాలకు రెవెన్యూ అధికారులు సాగు పట్టాలిచ్చేశారు. ఇక శింగనమల మండలం ఆనందరావుపేట ఆంజనేయస్వామి గుడి పరిధిలో 80వ సర్వే నంబరు కింద 6.60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇవన్నీ మచ్చుకు మాత్రమే.

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

ఆలయాల నిర్వహణ, మాన్యం భూముల పరిరక్షణ విషయంలో దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. కొందరు అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి.. భగవంతునికే పంగనామాలు పెడుతున్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో మాన్యాలు కరిగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్‌ గంజి మల్లికార్జునప్రసాద్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పలువురు అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో మాన్యం భూములకు

రక్షణ కరువు

దేవదాయ శాఖ అధికారుల

పర్యవేక్షణ లోపం

యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులు

చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలో అన్యాక్రాంతమైన ఆలయ భూముల వ్యవహారం చాలా వరకు కోర్టుల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా గూగూడు చెన్నకేశవస్వామి ఆలయ భూములు, శింగనమల మండలం ఆనందరావు పేట ఆంజనేయస్వామి గుడి భూములు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆర్డీఓ నేతృత్వంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం.

– వన్నూరుస్వామి, ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement