అనంతపురం: అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏడీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఏపీ రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా శ్రీసత్యసాయి జిల్లా జట్టు నిలిచింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఫైనల్స్‌లో తూర్పుగోదావరి జిల్లా జట్టుతో తలపడిన శ్రీసత్యసాయి జిల్లా జట్టు క్రీడాకారులు విజయం కోసం శ్రమించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి క్షణంలో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ఒక్క గోల్ సాధించి విజయ కేతనం ఎగురవేసింది. అలాగే మూడో స్థానం కోసం అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా.. అనంతపురం జిల్లా బాలికలు ఆది నుంచి ఆధిపత్యం కనబరిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులను ముప్పుతిప్పలు పెడుతూ 0–4 గోల్స్ తేడాతో విజయకేతనం ఎగుర వేశారు. దీంతో నాల్గో స్థానంతో కర్నూలు జట్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగింపు కార్యక్రమానికి ఎన్‌ఐసీ కోచ్ ఇస్మాయిల్ (పోలీస్ ఇన్‌స్పెక్టర్), ఏడీఎఫ్‌ఏ అధ్యక్షుడు దాదాఖలందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి మల్లేష్, కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ హాజరై, విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసి, అభినందించారు.
రన్నర్స్‌గా తూర్పు గోదావరి జిల్లా
మూడో స్థానంతో సరిపెట్టుకున్న
అనంతపురం జట్టు


