అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. ప్రజలు తమ అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ లోనూ సమర్పించవచ్చని తెలిపారు.
టీబీ డ్యాంలో
31 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం 31.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను 1606.50 అడుగల మేర నీటిమట్టం ఉంది. ఇన్‌ఫ్లో 12,869 క్యూసెక్కులుండగా.. 3,561 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.43 అడుగులతో 77.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నేడు ఎస్కేయూ
పాలక మండలి సమావేశం
● ఎజెండాలో లేని రిజిస్ట్రార్ నియామకం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ నియామకం జరిగింది. అయితే అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్‌గా ఉన్న రమేష్‌బాబును నియమించడం విమర్శలకు తావిచ్చింది. ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఏకంగా రిజిస్ట్రార్ పదవిలోకి వచ్చి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పదవీ కాలం కూడా ముగుస్తోంది. కొత్త రిజిస్ట్రార్ నియామకంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చిస్తారని అందరూ భావించగా.. అజెండాల్లో ఆ అంశమే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రారంభం
ప్రశాంతినిలయం: గురుపౌర్ణమిని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో గ్లోబల్ మెడికల్ క్యాంప్‌ను ఆదివారం ప్రారంభించారు. నార్త్ –1 భవన్‌లో సత్యసాయి బాబా చిత్రపటం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు వైద్య శిబిరం ఉంటుందన్నారు. దేశ విదేశాలకు చెందిన 70 మందికి పైగా వైద్యులు, 40 మంది పారామెడికల్ నిపుణులు, 80 మంది ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు. ఈఎన్‌టీ, గుండె జబ్బు లు, జనరల్ మెడిసిన్, కంటి, గైనకాలజీ, దంత వైద్యం, మానసిక ఆరోగ్యం, పిల్లల వైద్యం, పాదాల వైద్యం, మధుమేహంతో పాటు అవసరమైన ల్యాబ్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


