అనంతపురం అర్బన్: ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేసేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్–నినో ప్రభావం కారణంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు అవకాశం ఉందన్నారు. దీంతో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు వరికి బదులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, ఉలవ, పెసర, మినుము, కొర్ర వంటివి సాగు చేసేలా చూడాలన్నారు. ఈ నెల 31లోగా రైతులు పంటల బీమా చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. పాడిపశువులకు గ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యాన పంటల్లో పీఎండీఎస్ విధానాన్ని అనుసరించేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తీర్ణం పెంచేలా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి ప్రేమ్‌చంద్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.


