బీఎల్‌ఏ నాగేష్‌ హత్య కేసులో 9 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏ నాగేష్‌ హత్య కేసులో 9 మంది అరెస్టు

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

కనగానపల్లి: రెండు రోజుల క్రితం జరిగిన వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ అంకె నాగేష్‌ హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి సీఐ ఎస్‌ మహమ్మద్‌ అలీ తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన అంకె నాగేష్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కనగానపల్లి సమీంలోని మారెమ్మగుడి వద్ద 9 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వడ్ల దస్తగిరి బాబు, నితీష్‌కుమార్‌, వన్నూరప్ప, అంకె మురళీ, సురేష్‌, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, లక్ష్మిదేవి ఉన్నారు. అనంతరం వారిని ధర్మవరం కోర్టుకు తరలించారు.

జోడు లింగాల

ఆలయంలో చోరీ

కూడేరు: ప్రసిద్ధి చెందిన కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు.. గురువారం ఉదయం 6 గంటలకు అర్చకుడు శివ ఆలయానికి వచ్చారు. అప్పటికే గర్భగుడి ముందు మందిరంలో నుంచి కోతులు బయటకు రావడంతో వాచ్‌మెన్‌ తలుపులు తీశాడనుకున్నారు. లోపలికి వెళ్లగా శాశ్వత హుండీ తలుపులు తెరిచి ఉండటం, మరో హుండీ బీగం పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రమేష్‌బాబుకు సమాచారమిచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవదాయశాఖ ఏసీ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, సీఐ రాజు, పోలీసు సిబ్బంది, కూ్‌ల్స్‌ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాచ్‌మెన్‌ను ప్రశ్నిస్తే తాను ఆలయం బయట నిద్రించినట్లు చెప్పాడు. తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ నెల 3న హుండీల్లోని నగదును లెక్కించామని ఈఓ తెలిపారు. సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకూ నగదును ఎత్తికెళ్లి ఉండొచ్చని ఈఓ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని హనుమేష్‌నగర్‌కు చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది.వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ వివరాల మేరకు.. తిరుపతిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవి, మేరీలకు ముగ్గురు పిల్లలున్నారు. మొదటి కుమార్తె ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. సమీప బంధువు భాగ్యనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ అనిల్‌కుమార్‌ బాలికను వేధింపులకు గురిచేశాడు. మనస్తాపంతో మంగళవారం సదరు బాలిక ఇంట్లోని బెడ్‌రూమ్‌లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి రవి బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే బాలిక తల్లితో సదరు అనిల్‌ సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. దీంతోనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

హాస్టల్‌ ఆవరణలో క్షుద్రపూజలు

ఉరవకొండ: పట్టణ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న గాంధీ హరిజనోద్ధరణ హాస్టల్‌ ఆవరణలో బుధవారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొందరు క్షుద్ర పూజల కోసం రెండు రాళ్లను పేర్చి దానిపై బండ పరిచి రాళ్ల మధ్యలో దీపాన్ని వెలిగించి జంతువు పుర్రె, ఎముకలు ఉంచి ఆ ప్రాంతంలో రక్తం, పసుపు, కుంకమ చల్లి పూజలు నిర్వహించినట్లు అక్కడి వస్తువులను బట్టి తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి అర్ధరాత్రి పూజలు చేసినట్లు గుర్తించారు. కోట్లాది రూపాయాలు విలువ చేస్తే హరిజనోద్దరణ హస్టల్‌ స్థలం కోసం చాలా కాలంగా వివాదం నడుస్తోంది. స్థలం రికార్డులను కొందరు స్వార్థపరులు తారుమారు చేసి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సదరు స్థలంలో ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహించడం చర్చనీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement