చదవలేక.. చావుకోరి | - | Sakshi
Sakshi News home page

చదవలేక.. చావుకోరి

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్‌లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్‌లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు.

మడకశిర: హాస్టల్‌లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్‌(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్‌లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్‌ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు. రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్‌లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్‌ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్‌కు వచ్చిన చంద్రేగౌడ్‌..రాత్రి వేళ హాస్టల్‌లోని వాష్‌రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్‌ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్‌ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్‌ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మడకశిరలో ఇంటర్‌

విద్యార్థి ఆత్మహత్య

చదవడం ఇష్టంలేక హాస్టల్‌లోనే ఉరివేసుకున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement