తాడిపత్రి రూరల్: మండలంలోని ఆలూరుకు చెందిన లక్ష్మీదేవి (60)పై ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ట్రాక్టర్ ట్రాలీ కింద ఉన్న నీడలో లక్ష్మీదేవి పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన రామనాథ్‌రెడ్డి ట్రాక్టర్‌ను నడపగా ఆమైపె టైరు ఎక్కింది. ఆమె కేకలు విన్న రామనాథ్ ట్రాక్టర్ నిలిపి వెనక్కి వచ్చి చూడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి కనపడింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
కూడేరు: మండల పరిధిలోని జయపురానికి చెందిన బోయ సూర్య (50) గురువారం తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. బోయ సూర్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఓ రైతుకు చెందిన 4 ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని అందులో బ్యాడిగి మిర్చి, వేరుశనగ పంటలు సాగు చేస్తూ వచ్చాడు. పంటలు సరిగా పండక అప్పులయ్యాయి. మరో పక్క కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదు. సాయంత్రం సమీపంలోని చెట్టుకు సూర్య వేలాడు కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిక్సర్లతో చెలరేగిన దత్తారెడ్డి
అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో జరుగుతున్న అండర్ – 23 ఇంటర్నల్స్ క్రికెట్ టోర్నీలో జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి సిక్సర్లతో చెలరేగాడు. గురువారం అనంతపురం, ప్రకాశం జిల్లా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అనంత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. ఓపెనర్ మచ్చా దత్తారెడ్డి 45 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మనోజ్‌కుమార్ 32 పరుగులు, ప్రదీప్‌రెడ్డి 22, రేహన్ 28, మల్లికార్జున 12 పరుగులు చేశారు.


