● జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.సాలురెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణ, ఫసల్ బీమా పంటల బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి రైతులకు సూచించారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఎల్‌డీఎం మారుతీ శ్రీనివాసులుతో కలిసి జేడీఏ విలేకరుల సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ పంట దిగుబడులు ఆధారంగా ఫసల్ బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కంది రైతులు ఎకరాకు 80, వరి రైతులు రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదంకు రూ.80, మిరపకు రూ.576 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉందన్నారు. జెనరాలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫసల్‌బీమా అమలవుతుందన్నారు. ఇక వాతావరణం ఆధారంగా అమలు చేస్తున్న వాతావరణ బీమా కింద వేరుశనగ ఎకరాకు 640, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, అరటికి రూ.3 వేలు, టమాటాకు రూ.1,600 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించి బీమా పథకంలో చేరాలన్నారు.
ఏఐసీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలు..
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా (ఏఐసీ) ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలవుతున్నట్లు డీఏఓ సాలురెడ్డి తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు వేరే పంట సాగు చేసివుంటే మార్పు చేసుకోవాలన్నారు. పంట మార్పు చేసినట్లు సెల్ప్ డిక్లరేషన్ బ్యాంకుల్లో సమర్పించి... కొత్తగా సాగు చేసిన పంటకు ప్రీమియం చెల్లించాలని తెలిపారు. పంటల బీమా వద్దనుకునే రైతులు ప్రీమియం గడువుకు రెండు మూడు రోజులు ముందే బ్యాంకుల్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు. పంట రుణాలు తీసుకోని (నాన్‌లోనీ) రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్‌సీ)కు వెళ్లి ప్రీమియం కట్టి బీమా పరిధిలోకి రావాలన్నారు.


