● ఒక్క ఎస్‌ఎంఎస్‌తో వెంటనే వివరాలు
● నేటితో ముగియనున్న సర్ గడువు
రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్‌ఓలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్‌ఓలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. సందేహాలన్నింటికి చాలా సులభమైన పరిష్కారాన్ని ఎన్నికల సంఘం చూపించింది. మొబైల్ ఫోన్‌తోనే ఇంటి నుంచే కేవలం ఒక ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్‌లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్‌తో కూడా తెలుసుకోవచ్చు.
ఎలా తెలుసుకోవాలంటే...
ఎస్‌ఐఆర్‌లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఎస్‌ఐఆర్ పూర్తయిందా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ఎస్‌ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు మెస్సేజ్ పంపించాలి. మెస్సేజ్ పంపగానే సెకన్లలోనే ఈసీ నుంచి మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, నియోజకవర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్‌లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెస్సేజ్ రాకపోయినా బూత్ లెవర్ ఆఫీస్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి.


