గుమ్మఘట్ట: మండలంలోని వేపులపర్తి క్రాస్ సమీపంలో ఉన్న వేదావతి హగరి నుంచి రాయదుర్గం పట్టణానికి ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ , రిజిస్ట్రేషన్ లేకపోవడంతో పాటు ఇసుకపై టార్పాలిన్ లేకుండా వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ చిన్నరాయుడు తెలిపారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేలు అపరాధ రుసుం వేశామన్నారు.
అప్పులబాధతో
యువకుడి ఆత్మహత్య
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): అప్పుల భారం తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన డీ.హీరేహాళ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్ (27) సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్‌లకు అలవాటు పడిన గౌరీశంకర్ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి అందులో డబ్బు పెట్టాడు. తీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన ఇంటి బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. లక్ష్మీకి ఇద్దరు కుమారులు ఉండగా గౌరీశంకర్ చిన్న కుమారుడని, ఇంకా వివాహం కాలేదన్నారు.
జెడ్పీ ప్రగతికి పాటుపడతాం
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి. కృష్ణమూర్తి బుధవారం బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా పనిచేద్దాం.. జిల్లా పరిషత్ ప్రగతికి పాటుపడుదామంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న మల్లికార్జున, ఏఓలు భాస్కర్ రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, షేక్ నియాజ్ పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
‘కేఎస్‌ఎన్’ డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల (మహిళలు)లో ఈ ఏడాది మే 4 నుంచి 19వ తేదీ వరకూ నిర్వహించిన 2, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ నాయక్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రగతి, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బీవీ రమణనాయుడు, అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి.రామలింగారెడ్డి, నాగభూషణంతో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
దొంగ అరెస్ట్
● రూ. 7 లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు పాల్పడుతున్న దొంగను అనంతపురం ఫోర్త్‌టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో వివరాలను నాల్గవ పట్టణ సీఐ మస్తాన్, సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, ఎస్‌ఐ గోపి వివరించారు. కక్కలపల్లి కాలనీకి చెందిన సాయికిరణ్ మద్యం, జూదం వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పగటి పూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది జూన్ నెల నుంచి నగర పరిసరాల్లో మూడు చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాలపై నిఘా పెట్టి నిందితున్ని నగర శివారులో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 7 లక్షలు విలువజేసే 3.14 తులాల బంగారం, 203. 5 గ్రాములు వెండి , రూ. 8 వేలు నగదు, టీవీ, గ్యాస్ సిలిండర్, నాలుగు చేతి గడియారాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


