రాయదుర్గంటౌన్: కర్ణాటకలోని గుడేకోట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి ఆర్టీసీ డ్రైవర్ ఎం.కరిబసప్ప (54) దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివరాల మేరకు ... కరిబసప్ప దాదాపు 17 ఏళ్లుగా రాయదుర్గం ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తిరుపతి సర్వీస్ డ్యూటీ ముగించుకుని వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం సాయంత్రం కర్ణాటకలోని గుడేకోటలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. గుడేకోట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఘటనలో కరిబసప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మొలకాల్మూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరిబసప్ప మృతిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో టిప్పర్‌కు మంటలు
గుమ్మఘట్ట: మండలంలోని సిరిగెదొడ్డి సమీపంలో ఓ టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల మేరకు పట్టణంలోని మున్సిపాలిటికీ చెందిన చెత్తను డంపింగ్ యార్డు నుంచి వేరు చేసిన వ్యర్థపదార్థాలను తీసుకుని టిప్పర్ సిరిగెదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న గోపాల్ పొలంలోని పాడుబడ్డ బావి వద్దకు వెళ్లింది. పైన వున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను డ్రైవర్ గమనించకపోవడంతో టిప్పర్‌ను అన్‌లోడ్ చేసేందుకు యత్నించాడు. పైన ఉన్న విద్యుత్ తీగలకు టిప్పర్‌పై భాగం తగలడంతో విద్యుదాఘానికి గురికావడంతో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డాడు. ఘటనలో టిప్పర్ టైర్లు కాలిపోయాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోని తీసుకువచ్చారు.
అరటి ఎగుమతికి రూ.1.03 కోట్లు మంజూరు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ఈ ఏడాది అరటి ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.03 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీడీ ఉమాదేవి, ఏడీ ధనుంజయ తెలిపారు. ప్రధానంగా తాడిపత్రి నుంచి ముంబైకి రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా రవాణాకు చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.


