● జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్య దాటని వైనం
● తగ్గిపోయిన రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం
అనంతపురం టౌన్: ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది.. అయితే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జీఓ 396 విడుదల చేసింది. దీంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి.. రిజిస్ట్రేషన్‌శాఖ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది.. దీంతో పాటు డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రోజూ 500లకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. అయితే ఆ సంఖ్య కాస్తా 40కి పడిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, వారి ద్వారా వినియోగదారులకు సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులిచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు సేవా కేంద్రాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే డాక్యుమెంట్ రైటర్ల మనుగడ కష్టతరంగా మారనుంది. దీంతో వారు పెన్‌డౌన్ చేస్తూ సమ్మెకు దిగారు.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
రైటర్ల పెన్‌డౌన్‌తో జిల్లా వ్యాప్తంగా స్తిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అనంతపురం రామ్‌నగర్ ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజువారీగా 78 స్లాట్లు ఉంటే మంగళ, బుధవారాల్లో కేవలం నాలుగైదు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రుద్రంపేటలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గుంతకల్లు, గుత్తి, కణేకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి పడుతోంది. రోజులవారీగా జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చేది. గత రెండు రోజులుగా రూ.5 లక్షలు కూడా దాటలేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు డాక్యుమెంట్ రైటర్ల అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.


