● బాలింతతో పాటు మరో ఇద్దరిపై దాడి
● 15 మంది దాడికి రావడంతో స్థానికుల బెంబేలు
గుంతకల్లు: ఎమ్మెల్యే జయరాం సోదరుడి డ్రైవర్ పట్టణంలో వీరంగం సృష్టించాడు. క్రికెట్ ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదంతో ఓ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో బాలింతతో పాటు మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి వద్ద డ్రైవర్ కమ్ అసిస్టెంట్‌గా అబ్బాస్ అనే టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు. పట్టణంలోని ఫక్కీరప్ప కాలనీలో క్రికెట్ ఆటలో అబ్బాస్ బంధువుల పిల్లలు, బాషా పిల్లలకు మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ – బాషా మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అబ్బాస్ 15 మంది అనుచరులతో కలసి వచ్చి ఫుల్‌గా మద్యం సేవించి బాషా ఇంటిపైకి దాడికి పాల్పడ్డారు. బాషా ఇంటిపై దాడి సమయంలో కేవలం అతని చెల్లెల్లు కరీమున్నీ (బాలింత) మాత్రమే ఉంది. బాలింత అని కూడా చూడకుండా అబ్బాస్, అతని అనుచరులు ఆమైపె రాడ్లు, కట్టెలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాషా అతని తమ్ముడు రహంతుల్లా ఇంటి వద్దకు చేరుకోగానే వారిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏకంగా 15 మంది దాడిలో పాల్గొనడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఘటనపై కసాపురం పోలీసుస్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. బుధవారం అబ్బాస్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.


