అనంతపురం అర్బన్: వ్యవసాయశాఖ పరిధిలో మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ అధికారులుగా 12 ఏళ్లగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఏపీ ఎంపీఈఓల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో నాగరాజు మాట్లాడారు. 12 ఏళ్లగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఇప్పటికీ రూ.12 వేలు వేతనం, రూ.3 వేలు ఇన్సెంటివ్ ఇస్తున్నారన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ 12 ఏళ్లుగా విన్నవిస్తున్నా నేటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని వాపోయారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టామన్నారు. సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేలు ఇవ్వాలన్నారు. ఎంపీఈలోకు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గంగారాజు, నరసింహులు, శివ, మనోహర్‌నాయుడు, ఉమాదేవి, ఎంపీఈఓలు పాల్గొన్నారు.


