బొమ్మనహాళ్:ఎరక్కపోయి వచ్చిన ఓ ఎలుగుబంటి ఇరుక్కుపోయిన ఘటన మండలంలోని నేమకల్లు వద్ద జరిగింది. ఆహారం కోసం గ్రామ శివారులోని కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోయింది. మంగళవారం కొండ వద్ద క్వారీలో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి ముందు భయాందోళన చెందారు. కొంతసేపటి తర్వాత ఎటూ కదల్లేని స్థితిలో ఉందని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రమణ్యం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనకు గురి కాకుండా కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలుగుబంటికి ఎలాంటి హాని కలగకుండా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చూస్తామన్నారు. ఒకవేళ భల్లూకం వెళ్లకుండా అక్కడే ఉంటే బుధవారం రోప్‌వే ద్వారా బోనులో బంధిస్తామని చెప్పారు.


