● రూ. 5 లక్షల విలువైన బంగారు గొలుసు,బైక్ స్వాధీనం
బుక్కరాయసముద్రం: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఇద్దరు అంతరాష్ట్ర చైన్‌స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాలమేరకు.. గత నెల 23న బుక్కరాయసముద్రంలో ప్రభావతి అనే మహిళ గ్రామ శివారులో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె అడ్డుకొని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాయన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అనంతపురము రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసులు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరుకు చెందిన గణేష్, సూర్యలే దొంగతనం చేసినట్లు గుర్తించి శనివారం అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారు గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. కేసును చేధించిన సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


