యాడికి: విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన యాడికిలో సోమవారం జరిగింది. మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన రంగస్వామి వీబీజీ–రామ్‌జీ పథకంలో ఎఫ్‌ఏగా పనిచేస్తున్నాడు. అతనికి ఎలాంటి విధులు అప్పగించకపోవడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం ఉన్నతాధికారులు నీ ఉద్యోగం తొలగించారని ఏపీఓ తెలిపారు. దీంతో మనోవేదనకు గురైన రంగస్వామి ఎంపీడీఓ వీర్రాజు, ఏపీఓ మద్దిలేటిలతో మాట్లాడినా తాము ఏమీ చేయలేమని చెప్పారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. ఏఎస్‌ఐ వెంకటేష్ అతడిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగస్వామి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని ఆరా తీశారు. ఘటనపై వారు మండలాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ, ఏపీఓపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు.


