కళ్లెదుటే నీళ్లు ..
తాడిపత్రిటౌన్: నాయకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వంతో చాగల్లు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు సాగునీటి అవస్థలు తప్పడం లేదు. దాదాపు 6 వేల ఎకరాలకు నీరందించాలని నిర్మించిన ప్రాజెక్ట్ నీటి కుండను తలపిస్తున్నా... పిల్ల కాలువలు పూర్తి కాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలకు చుక్కనీరు అందని దుస్థితి నెలకొంది.
వైఎస్సార్ హయాంలో నిర్మాణం
తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని పెన్నానది పై చాగల్లు ప్రాజెక్ట్‌ను 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా దాదాపు రూ.244 కోట్లతో నిర్మించారు. 1.5 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు ెకుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా మండలంలోని ఆయా గ్రామాలకు దాదాపు 6 వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి దశాబ్ద కాలం పూర్తవుతున్నా ప్రధాన కాలువలు పూర్తిచేశారు తప్ప ఆయకట్టు భూములకు నీరందించే పిల్ల కాలువలను నిర్మించలేదు.
ఎండుతున్న పంటలు
దాదాపు 10 కిలో మీటర్లు పొడవున్న కుడి కాలువ ద్వారా పెద్దపప్పూరు మండలంలోని షేక్‌పల్లి, ధర్మాపురం, సోమనపల్లి, చింతలపల్లి, చిన్నపప్పూరు, జూటూరు గ్రామాలకు చెందిన దాదాపు 4,500 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. అలాగే 11 కిలో మీటర్లు పొడవున్న ఎడమ కాలువ ద్వారా పసలూరు, కమ్మవారిపల్లి, సుంకేసులపల్లి, అత్తిరాలదిన్నె గ్రామాలకు చెందిన దాదాపు 1500 ఎకరాల భూములకు నీరు ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా మండలంలోని పెండేకల్లు నిర్మించిన పెండేకల్లు ప్రాజెక్ట్‌కు నీరు చేరుతుంది. ప్రాజెక్ట్‌లో 262 మీటర్లకు నీరు చేరితే కాలువలకు నీరు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం చాగళ్లు ప్రాజెక్ట్ నీటితో కళకళలాడుతున్నా పక్క ఆయా గ్రామాల్లో సాగు నీరు లేక పంటలు ఎండుతున్నాయి. మండలంలో వర్షాలు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి రైతులు పంటలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. వందల అడుగులు బోరుబావులు తవ్వి లక్షలాది రూపాయలు ఖర్చుచేసుకుంటూ అప్పులపాలు అవుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు చాగల్లు ఆయకట్టు రైతుల కష్టాలను గుర్తించి పంటలను కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు.
నీటితో కళకళలాడుతున్న చాగల్లు ప్రాజెక్టు
పిల్ల కాలువలు లేకపోవడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు
ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు


