రాయదుర్గంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో చోరీ

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రహంతుల్లా, హసీనా దంపతుల ఇంట్లో బీరువాలో దాచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.1.80 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హసీనా అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి వారి అమ్మవారి ఇంటికెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఇంటికొచ్చి చూసేసరికి దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంటి డోర్‌తో పాటు బెడ్‌రూమ్‌ డోర్‌కు ఉన్న తాళాలు సైతం పెకిలించారన్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారు, వెండి, నగదును దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

పామిడిలోనూ...

పామిడి: పట్టణ టీచర్స్‌కాలనీలోని కుళ్లాయప్ప ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కుళ్లాయప్ప, అతని కుటుంబ సభ్యులు పని మీద ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రెండున్నర తులాల బంగారు నగలు, 40 తులాల వెండి అపహరించారు. సోమవారం ఇంటికి చేరిన వారు ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అనంతపురం క్లూస్‌టీమ్‌ ఆ ఇంటిని పరిశీలించి వ్రేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి ఆత్మహత్య

పుట్లూరు: మండలంలోని గాండ్లపాడు సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని నబీ రసూల్‌ (63) అనే వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. యల్లనూరు మండలం గిరమ్మబావికి చెందిన నబీరసూల్‌ 30 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట గ్రామానికి వెళ్లి స్థిరపడ్డాడు. ఆదివారం తన సోదరులను కలవడానికి గిరమ్మబావికి వచ్చి తిరిగి తాడిపత్రి మీదుగా ఎర్రగుంటకు వెళ్లడానికి బయలుదేరాడు. అయితే సోమవారం ఉదయం గాండ్లపాడు గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తికి నబీరసూల్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నార్పలలో మరొకరు...

నార్పల: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాలమేరకు... కొత్త బస్టాండ్‌ సమీపంలో ఖాజాబాషా స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు నూర్‌ మహమ్మద్‌ (23) సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అవివాహితుడైన నూర్‌ మహమ్మద్‌ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అతిగా మద్యం సేవించి యువకుడి మృతి

నార్పల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేసేపల్లిలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు ..కేసేపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల రామకృష్ణ , పెద్దక్కకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు భాస్కర్‌ (30) వారం రోజుల క్రితం బైక్‌పై నుంచి కింద పడి గాయలయ్యాయి. అయినప్పటికీ అలాగే మద్యం సేవించేవాడు. ఈ విషయంపై రెండు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకి వెళ్లి అక్కడే పడుకున్నాడు. ఉదయం స్థానికులు అతన్ని లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో భాస్కర్‌ చనిపోయినట్లు గుర్తించారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవడంతో భాస్కర్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement