యాత్రను విజయవంతం చేసినందుకు ఽకృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

యాత్రను విజయవంతం చేసినందుకు ఽకృతజ్ఞతలు

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

కూడేరు: వైఎస్సార్‌సీపీ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కూడేరు మండలం చోళసముద్రం దగ్గర నిర్వహించిన హంద్రీ నీవా ప్రాజెక్ట్‌ పరిరక్షణ పోరుబాటను విజయవంతం చేసినందుకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోరుబాటకు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ అన్ని విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక, మండల నేతలు అదిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. పోరుబాట వైఎస్సార్‌సీపీ స్వప్రయోజనం కోసం కాదని, హంద్రీ–నీవా కాలువకు లైనింగ్‌ చేపట్టడంతో రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపామన్నారు. లైనింగ్‌పై రాజకీయం చేయడం లేదని, లైనింగ్‌ పనులు చేపట్టే సమయంలోనే అధికార పార్టీకి చెందిన రైతులే లైనింగ్‌ పనులు ఆపాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు.

సీపీఐ నుంచి ముగ్గురి సస్పెండ్‌

అనంతపురం అర్బన్‌: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన ముగ్గురిని సస్పెండ్‌ చేశామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సహాయ కార్యదర్శి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్‌, ఇతర నాయకులతో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించామన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.కుళ్లాయిస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జాన్సన్‌బాబు, జిల్లా ఆటో డ్రైవర్ల సంఘం కార్యదర్శి ఎస్‌.రమణయ్యను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.

ఎంపీఈఓల పెన్‌డౌన్‌

ఉమ్మడి అనంత జిల్లాలో 334 మంది నిరసన

అనంతపురం అగ్రికల్చర్‌: సమస్యల పరిష్కరించాలంటూ ఎంపీఈఓలు పెన్‌డౌన్‌కు దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 334 మంది సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పెన్‌డౌన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఎక్కడిక్కడ మండల, డివిజన్‌, జిల్లా గ్రీవెన్స్‌లో, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ పరిధిలో, ఆర్‌బీకేలకు అనుబంధంగా అనంతపురం జిల్లాలో 189 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 145 మంది... వెరసి 334 మంది ఎంపీఈఓలు సరైన వేతనం లేక, ఎలాంటి ఉద్యోగ భద్రత, ఇతరత్రా సదుపాయాలు లేక అతికష్టమ్మీద జీవితాలను నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటిి ప్రోత్సాహం లేకపోవడంతో 334 మంది ఎంపీఈఓలు నిరసనకు దిగారు.

మద్యం షాపు తొలగించండి

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించి వేరే చోటికి మార్చాలని 16వ వార్డు మహిళలు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో మొరపెట్టుకున్నారు. సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యేతో మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాకపోకలకు సాగించే రహదారిలో మద్యం షాపు ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో మూడు నెలల వరకే మద్యం షాపులకు అనుమతి ఉందని, ఆ తర్వాత అక్కడ షాపు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement