అనంతపురం సిటీ: రోజుకో అబద్ధంతో వంచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఈ నేపథ్యంలో ఉనికి కోసం టీడీపీ నేతలు ఉలికి పడుతూ... దానిని వైఎస్సార్‌సీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కూడేరు మండలాధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హంద్రీనీవా పనులు రైతులకు కాకుండా టీడీపీ నేతలు, కాంట్రాక్టర్‌కు లాభదాయకంగా మారాయన్నారు. గత ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాకు 60 టీఎంసీలు నీటిని తీసుకొచ్చినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతుండడం హాస్యాస్పందంగా ఉందన్నారు. జిల్లాకు చేరింది కేవలం 50 టీఎంసీలు మాత్రమేనని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. సాగు నీటి కథ పక్కన పెడితే కనీసం తాగునీటికీ ప్రజలు ఇక్కట్లు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. రెండో దశ లైనింగ్ పనుల విషయంలోనూ టీడీపీ నేతలు ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. మొదటి దశ కాలువలో 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేస్తే, ఆ డీపీఆర్ ప్రకారం రెండో దశ కాలవలో కనీసం 1,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా పనులు చేయాల్సి ఉందన్నారు. అలాంటిది జీడిపల్లి నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు 750 క్యూసెక్కులు, ఆ తర్వాత 350 క్యూసెక్కులకు పరిమితం చేసి, హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను డ్రైనేజీగా మార్చేసి లైనింగ్ పనులు చేయడంతో రైతులకు నష్టం చేశారన్నారు.ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాని, రైతాంగానికి లబ్ధి చేకూరేలా చేయాలని హితవు పలికారు. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాయలసీమ వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


