అనంతపురం అర్బన్: ‘‘టూ వీలర్ రాపిడో కారణంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. వెంటనే దాన్ని రద్దు చేసి మా జీవనోపాధిని కాపాడండి.’’ అంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు సోమవారం ఆటోలతో సహా వచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ రోడ్డుకు ఇరువైపులా ఆటోలను నిలిపివేశారు. నాయకులు, ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ధర్నాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ (న్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేంద్రకుమార్, రాజేష్‌గౌడ్, చంద్రశేఖర్ మాట్లాడారు. ఆటో కార్మికుల జీవనోపాధి కాపాడాలంటే టూ వీలర్ ర్యాపిడోను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంలో పోలీసులు పరిస్థితిని అధికారులకు తెలియజేశారు. దీంతో రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వీర్రాజు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు నాయకులు వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. సమస్యలపై డీటీసీ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుని ఆటోడ్రైవర్ల ఉపాధిని కాపాడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ముత్తుజ, గోపాల్, చిరంజీవి, కృష్ణుడు, శ్రీనివాసులు, నాగరాజు, రాజు, కృష్ణానాయక్, హాజీ, తదితరులు పాల్గొన్నారు.


