అనంతపురం: మహిళలపై విచక్షణా రహిత దాడులు, వివస్త్రను చేసి పాశవికంగా అకృత్యాలకు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితిలో పాలకులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ.. వైఎస్సార్‌సీపీ నాయకులకే రెడ్ బుక్ రాజ్యాంగంలో చోటు కల్పించారని అనుకున్నామని, అయితే పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మహిళలపైనా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, బద్వేలు, నెల్లూరు ఘటనలు దుశ్శాసన పర్వంగా అభివర్ణించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఏడుగుర్రాలపల్లి ఘటన దగ్గర నుండి గుంటూరు వరకు ఎక్కడా మహిళలకు రక్షణ లేదన్నారు. వీటిన్నింటిలోనూ టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. బద్వేలులో మహిళపై దాడి చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఇందుకు కారణమైన మాధవిరెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో పసుపులేటి పద్మావతి, అంజలి, మాజీ సర్పంచ్ పార్వతి, చంద్రలేఖ, ప్రసన్న , పార్వతి, మహేశ్వరి, భానుమతి, చంద్రకళ, కుళ్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు.


