అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాల విభజన నేపథ్యంలో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలు పలువురు ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదోన్నతి పొంది వ్యక్తిగత కారణాలతో తిరిగి పాత కేడర్‌కు (రివర్ట్) వచ్చిన ఉపాధ్యాయుల దశాబ్దాల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా సీనియార్టీ జాబితాల చివరన చేర్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల విభజన ప్రక్రియలో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాల్లో రివర్ట్ అయిన ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర కారణాలతో పదోన్నతిని వదులుకుని తిరిగి పాత కేడర్‌కు వచ్చిన ఉపాధ్యాయుల సీనియార్టీని శ్రీసున్నాశ్రీగా పరిగణిస్తూ వారిని జాబితాల్లో చివరన ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా వందలోపు సీనియార్టీ ఉన్న కొందరు టీచర్లు ప్రస్తుతం 6 వేలకుపైగా స్థానాలకు వెళ్లిపోయారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది అనంతరం తిరిగి ఎస్జీటీలుగా వచ్చిన ఉపాధ్యాయులే ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
నిబంధనలు ఏమంటున్నాయి?
ఉపాధ్యాయ సంఘాల వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లోని రూల్ 33(ఏ) ప్రకారం ఉద్యోగి సీనియార్టీ మొదటి రెగ్యులర్ నియామక తేదీ ఆధారంగానే నిర్ణయించాలి. పదోన్నతి పొంది తిరిగి ఫీడర్ కేడర్‌కు వచ్చిన ఉద్యోగి గతంలో సంపాదించుకున్న సీనియార్టీని రద్దు చేసే నిబంధన ఎక్కడా లేదని వారు చెప్తున్నారు. అలాగే రూల్ 35(బీ) ప్రకారం సొంత అభ్యర్థనపై ఒక జిల్లా లేదా యూనిట్ నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన ఉద్యోగికే బాటమ్ సీనియార్టీ వర్తిస్తుందని, ఒకే జిల్లాలో రివర్ట్ అయిన ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంటున్నారు. రూల్ 28 ప్రకారం పదోన్నతిని తిరస్కరించినా లేదా పదోన్నతి అనంతరం తిరిగి పాత పోస్టుకు వచ్చినా, ఆ ఉద్యోగి కేవలం ఆ ప్యానెల్ ఏడాదికి మాత్రమే పదోన్నతి అవకాశాన్ని కోల్పోతాడని, ఫీడర్ కేడర్‌లోని అసలు సీనియా ర్టీపై ప్రభావం ఉండదని సంఘాలు గుర్తు చేస్తున్నాయి. రివర్ట్ అయిన ఉపాధ్యాయులకు బాటమ్ సీనియార్టీ వర్తిస్తోందని అధికారులు చెబుతున్నప్పటికీ, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు లేదా స్పష్టమైన సర్వీస్ రూల్స్‌ను చూపించడం లేదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. రివర్ట్ టీచర్ల సీనియార్టీ జాబితాల తయారీలో కొందరు డీఈఓ కార్యాలయ ఉద్యోగులు ద్వంద్వ వైఖరి అవలంబించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా తమ సీనియార్టీని తొలగించారని ఆరోపిస్తున్న బాధిత ఉపాధ్యాయులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.
దశాబ్దాల సేవ.. ఒక్క జాబితాతో
తుడిచిపెట్టిన వైనం
29 ఏళ్ల కష్టానికి జాబితాలో చివరన చోటు
ఉమ్మడి జిల్లాలో 50 మందికి పైగా
బాధితులు
బోయ కూరగాయల ముత్యాలప్ప ధర్మవరం మండలం గొట్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పని చేస్తున్నారు. గతంలో ఈయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతి పొంది ఐదు నెలలు పని చేశారు. అనారోగ్య సమస్యలకు తోడు, కుటుంబ ఇబ్బందుల కారణంగా పదోన్నతి వదులుకొని రివర్ట్ వచ్చారు. 29 ఏళ్ల సీనియార్టీ ఉంది. ఎస్జీటీ సీనియార్టీ జాబితాలో వందలోపే ఉంటారు. కానీ జాబితాలో అట్టడుగున చివరి పేరు 6133 నంబరులో ఉంచారు.
శెట్టిపల్లి వెంకటరంగారెడ్డి కనగానపల్లి ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పని చేస్తున్నారు. ఈయన సోషల్ టీచరుగా పదోన్నతి పొంది వ్యక్తిగత కారాణాలతో మూడు నెలల్లోపు వెనక్కు (రివర్ట్) వచ్చారు. ఈయన సర్వీసు 27 ఏళ్లు. ఎస్జీటీల జాబితాలో 135 నంబరులో ఉండాల్సిన వెంకటరంగారెడ్డిని 6,075కు పంపారు. వీరిద్దరే కాదు...ఉమ్మడి జిల్లాలో ఇలాంటి వారు 50 మందికి పైగా ఉన్నారు.


