● ఇండస్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వక్తలు
అనంతపురం: ఆర్థోపెడిక్ సమస్యల చికిత్సల కోసం ఇకపై బెంగుళూరు, హైదరాబాద్, ఇతర మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అనంతపురంలోని బళ్లారి బైపాస్ మార్గంలో నూతనంగా ప్రారంభించిన ఇండస్ హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ మదన్‌కుమార్ రెడ్డి, స్నేహ రెడ్డి తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, తదితరులు హాజరై ఇండస్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు. డాక్టర్ మదన్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. ఫ్రాక్చర్ చికిత్స నుంచి కీళ్ల మార్పిడి , మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, ఆర్థోపెడిక్ చికిత్సలు, ట్రామా కేర్ సేవలను అందిస్తున్నామన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
● ఐదుగురికి గాయాలు
ముద్దనూరు: ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు..వైఎస్సార్ కడప జిల్లా చెన్నారెడ్డిపల్లె వద్దకు వెళ్లగానే ముందువైపు గొర్రెలు అడ్డు రావడంతో బస్సును డ్రైవర్ స్లో చేశాడు. ఇంతలో వెనుక వస్తున్న లారీ.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతినింది. బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకొని వెళ్లిపోయారు. కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు. లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
పెనుకొండ రూరల్: అమ్మవారిపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కియా పోలీసులు తెలిపిన వివరాలు... కళ్యాణదుర్గానికి చెందిన రమేష్ గుట్టూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కియా అనుబంధ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని స్థానికులు 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు.


