అనంతపురం ఎడ్యుకేషన్: పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026’ కార్యక్రమాన్ని ఈ నెల 20న నిర్వహించనున్నారు. జిల్లాలో 192 మంది పదో తరగతి విద్యార్థులు, 38 మంది ఇంటర్ విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. 20న ఉదయం 8 గంటలకు జేఎన్‌టీయూ కళాశాల ఆవరణలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో కలెక్టర్ ఓ. ఆనంద్ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డులకు ఎంపికై న ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో కలిసి నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, మెడల్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
గుంతకల్లు చిన్నారి
కిడ్నాప్ కథ సుఖాంతం
గచ్చిబౌలి(హైదరాబాద్): గుంతకల్లుకు చెందిన ఓ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంత మైంది. శనివారం హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ డాక్టర్ రమేష్ వివరాలను వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన వీధి వ్యాపారి గోవిందమ్మ తన మూడేళ్ల కుమార్తె పుష్పరాణితో కలిసి ఈ నెల 15న రాత్రి హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగింది. స్థానిక 6వ నంబర్ ప్లాట్‌ఫాంపై నిద్రకు ఉపక్రమించింది. కొద్దిసేపటి తర్వాత లేచి చూసిన గోవిందమ్మకు కూతురు కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో చందానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. వికారాబాద్, పరిగికి చెందిన కొత్తి శ్రీనివాస్, బండ్లగూడ కాళీమందిర్‌కు చెందిన దోమ రామకృష్ణలు రైల్వేస్టేషన్ చేరుకుని రాత్రి 2 గంటల సమయంలో చిన్నారి పుష్పరాణిని కిడ్నాప్ చేసి మహబూబ్‌నగర్‌కు తరలించినట్లు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్న నవనీత కిడ్నాప్ చేయించినట్లు గుర్తించి ఆమెను కూడా అరెస్టు చేశారు.
వ్యవసాయశాఖలో 87 ఖాళీలు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రపత్తి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖలో 87 ఖాళీలు ఉన్నట్లు వెల్లడైంది. రెండు జిల్లాల పరిధిలో మొత్తంగా 571 మంది ఉండాలి. ప్రస్తుతం 484 మంది పనిచేస్తుండగా, 87 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 59 ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 28 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కువగా వాచ్‌మెన్ పోస్టులు 26, మెసెంజర్ పోస్టులు 14, ఏఈఓ పోస్టులు 12 ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.


