గుత్తి రూరల్: నెల నెలా వేతనం వస్తే చాలు.. పిల్లల భవిష్యత్ ఏమైతేనేం అనే గురువులు ఉండొచ్చు.. ప్రభుత్వ నిధులు మంజూరైతే పాఠశాలను అభివృద్ధి చేద్దామనే ఉపాధ్యాయులు ఉండొచ్చు.. కానీ కె.ఊబిచెర్ల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఓబిలేసు నిధులు లేకపోయినా సొంత డబ్బులు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తానే సొంతంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు.
మండలంలోని కె.ఊబిచెర్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాలు, పరిసరాలు అధ్వానంగా ఉండేవి. పాఠశాల పరిస్థితి చూసి చలించిన హెచ్‌ఎం పాఠశాలను ఎలాగైనా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొందరు దాతలను అడిగినా ఫలితం లేదు. దీంతో హెచ్‌ఎం ఓబులేసు సొంత డబ్బులు రూ.64,300 ఖర్చు చేసి పాఠశాలలో సమస్యలను పరిష్కరించారు. పాఠశాల చుట్టూ ఉన్న అపరిశుభ్రత తొలగించారు. విద్యుత్ తీగలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రార్థన స్టేజీ నిర్మించారు. నీటి వసతి కోసం నూతన పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పాఠశాల కళావిహీనంగా ఉండటంతో రంగులు వేయించారు. పాఠశాల విద్యార్థులకు శుద్ధ నీటిని అందించే ఫిల్టర్, మోటార్‌కు మరమ్మతు చేయించారు. కిటికీలకు కడ్డీలు లేక పోవడంతో వెల్డింగ్ చేయించారు. పాఠశాలలో మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాల అనతి కాలంలోనే అభివృద్ధి చెందడం, విద్యార్థుల వేష, భాషలు, చదువుల్లో మార్పు రావడం, డిజిటల్ బోధన, మౌలిక వసతులు చూసిన తల్లితండ్రులు పిల్లలను గ్రామంలోని పాఠశాలలో చేర్పించడంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 53కు చేరింది. గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేసిన హెచ్‌ఎంను గ్రామస్తులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు అభినందించారు.
హెచ్‌ఎం చొరవతో రూపుదిద్దుకున్న కె.ఊబిచెర్ల పాఠశాల
పాఠశాల భవనానికి రంగులు వేయిస్తున్న ఉపాధ్యాయుడు ఓబులేసు
కె.ఊబిచెర్ల పాఠశాల అభివృద్ధికి నడుంబిగించిన హెచ్‌ఎం
సొంత డబ్బు వెచ్చించిన వైనం


