● ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్‌పర్స్‌న్ గిరిజమ్మ
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత మూడేళ్ల కాలంలో మంజూరై ప్రారంభం కాని పనులన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశించారు. శుక్రవారం జెడ్పీలోని తన చాంబర్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో చైర్‌పర్సన్ సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ కే మల్లికార్జునతో కలిసి నిర్వహించిన సమావేశంలో గిరిజమ్మ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో 63 మండలాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో బాధపడుతున్నారన్నారు. పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఆదేశాలతో జిల్లాలో మూడేళ్ల కాలంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల ఆధునికీకరణ, అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాల నిర్మాణం లాంటి పనులకు రూ.కోట్లు మంజూరు చేశామని చైర్‌పర్సన్ గుర్తు చేశారు. ప్రారంభం కాని పనులను గుర్తించి శనివారం సాయంత్రంలోపు జెడ్పీ కార్యాలయానికి పంపాలని సీఈఓ విజయలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం, జెడ్పీ సాధారణ నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈలు సి. సుబ్బరాయుడు (అనంతపురం), మురళి (శ్రీసత్యసాయి), ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు శ్రీనివాసులు (అనంతపురం), మురళీధర్ (శ్రీసత్యసాయి), పీఆర్‌ఐ ఈఈ రాజన్న (అనంతపురం), పెనుకొండ ఈఈ మురళి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు శ్రీనివాసులు, మురళీధర్‌లు, జెడ్పీ ఏఓలు శ్రీనివాసులు, నందకిశోర్, ఇతర సిబ్బంది హాజరయ్యారు.
‘దాహం..దాహం’ కథనంతో
కదలిన యంత్రాంగం
జిల్లాలోని మంత్రి కేశవ్, విప్ శ్రీనివాసులు నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిపై ‘ దాహం..దాహం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘ గొంతు ఎండి పోతోంది.. గుక్కెడు నీరివ్వండి’ అంటూ జిల్లాలోని ఉదిరిపికొండ, కొనకొండ్ల, విడపనకల్లు, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మహిళలు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. ఈక్రమంలోనే కమిషనర్ ఆదేశాలకనుగుణంగా జెడ్పీ అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఇప్పటికే రెండు విడతలుగా సమీక్షలు నిర్వహించి, తాగునీటి సమస్య అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించారు.


