మా స్థానం సం‘క్షేమం’.. మేమొదలం! | - | Sakshi
Sakshi News home page

మా స్థానం సం‘క్షేమం’.. మేమొదలం!

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమశాఖలో అవసరానికి మించి సూపరింటెండెంట్లు కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. రెండు సూపరింటెండెంట్‌ పోస్టులకు నలుగురు సూపరింటెండెంట్లు అదనపు పోస్టుల పేరుతో అదే స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 126 హాస్టళ్లకు ఇద్దరే సూపరిటెండెంట్లు ఉండగా, ప్రస్తుతం 50 హాస్టళ్లకు నలుగురు సూపరింటెండెంట్లు పైరవీలతో అక్కడే తిష్ట వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మూతపడిన ఎన్‌జీపీసీ పోస్టు కూడా కార్యాలయానికి మళ్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో గతంలో 126 హాస్టళ్లకు ఇద్దరు సూపరింటెండెంట్లతోనే సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం సమర్థంగా పని చేసింది. ప్రస్తుతం జిల్లా విభజన తర్వాత హాస్టళ్ల సంఖ్య 50, కార్యాలయ సిబ్బంది సంఖ్య 37 నుంచి 19కు తగ్గినా, సూపరింటెండెంట్ల సంఖ్య మాత్రం నలుగురికి చేరడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. శాఖలో మంజూరైన సూపరింటెండెంట్‌ పోస్టులు రెండే ఉన్నప్పటికీ ప్రస్తుతం నలుగురు ఆ హోదాలో పని చేస్తున్నారు. అదనంగా ఉన్న ఇద్దరు ఏఎస్‌ఓ, ఇన్‌స్ట్రక్టర్‌ అగైనెస్ట్‌ పోస్టులపై విధులు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ కార్యాలయంలో క్లర్కులుగా పనిచేసిన వారు పదోన్నతులు పొంది ఇతర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత పైరవీల ద్వారా తిరిగి ఇదే కార్యాలయానికి వచ్చి కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు 37 మంది ఉద్యోగులతో కళకళలాడిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. వారిలో క్లర్కులు ముగ్గురు మాత్రమే ఉండగా, సూపరింటెండెంట్లు నలుగురు ఉండడం అవసరానికి మించిన సిబ్బంది కేటాయింపుగా ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఎన్‌జీపీసీ పోస్టు కూడా మళ్లించే ప్రయత్నం

మూతబడిన న్యూ గార్మెంట్స్‌ ప్రొడెక్షన్‌ సెంటర్‌ (ఎన్‌జీపీసీ)లోనూ ఓ సూపరింటెండెంట్‌ పోస్ట్‌ ఉంది. బయట పని చేస్తున్న ఓ సూపరింటెండెంట్‌ ఇటీవల అక్కడికి వచ్చారు. మూతపడిన ఎన్‌జీపీసీలో ఎలాంటి పని ఉండదు. ఆ సూపరింటెండెంట్‌ కూడా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సూపరింటెండెంట్‌ కూడా ఇక్కడికి వస్తే మొత్తం ఐదుగురు సూపరింటెండెంట్లు అవుతారు. జోనల్‌ పరిధిలో అవసరమైన చోట్లకు బదిలీ చేయకుండా ఒకేచోట కొనసాగించడం వెనుక పైరవీలు పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు అంటున్నారు. పెన్నార్‌ భవనంలో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సిబ్బంది వినియోగంపై సమీక్ష నిర్వహించాలని పలువురు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖలో అవసరానికి మించి సూపరింటెండెంట్లు

పదోన్నతులొచ్చినా... అదే కార్యాలయంలో మకాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement