అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల సెకండరీ స్థాయిలో భాషేతర (గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం) సబ్జెక్టు ఉపాధ్యాయులకు శనివారం డివిజనల్ స్థాయి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (టీపీడీ) ఒకరోజు శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసరావు, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అకడమిక్ క్యాలెండర్, టీచర్స్ హ్యాండ్‌బుక్, స్టూడెంట్ అసెస్‌మెంట్ బుక్‌లెట్, కరిక్యులం సంస్కరణలు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, లీప్ యాప్ తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం నియమించిన ఎస్‌ఆర్‌పీలు, డీఆర్‌పీలు తప్పనిసరిగా హాజరుకావాలని, అర్హులైన ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడు గైర్హాజరైనా సంబంధిత ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మూడు డివిజన్లలో శిక్షణ కేంద్రాలు
అనంతపురం డివిజన్: నేతాజీ మున్సిపల్ స్కూల్, పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్, కొత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, రాజేంద్ర మున్సిపల్ స్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం నగరం, అనంతపురం రూరల్, ఆత్మకూరు, బీకేఎస్, గార్లదిన్నె, కూడేరు, నార్పల, పెద్దపప్పూరు, పుట్లూరు, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, యల్లనూరు మండలాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉంటుంది.
గుంతకల్లు డివిజన్: ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్‌ఆర్‌కే మున్సిపల్ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో గుంతకల్లు, గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, యాడికి మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది.
కళ్యాణదుర్గం డివిజన్: కేసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జ్ఞానభారతి పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్ నార్త్, ఏపీ మోడల్ స్కూల్‌లలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెళుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, రాయదుర్గం, శెట్టూరు మండలాల ఉపాధ్యాయులు హాజరుకావాలని అధికారులు సూచించారు.
యువకుడిపై కత్తితో దాడి
తాడిపత్రిటౌన్: స్థానిక పెన్నానదిలో ఇసుక తవ్వకాల కోసం తలెత్తిన ఘర్షణలో ఓ యువకుడు గాయపడ్డాడు. పట్టణంలోని నందలపాడుకు చెందిన రవికుమార్‌కు సంజీవనగర్‌లో ఉండే భరత్‌కు మధ్య పదిరోజుల క్రితం పెన్నానదిలో ఇసుక తవ్వకాల విషయంలో ఘర్షణ జరిగింది. శుక్రవారం సంజీవనగర్ పార్కు వద్ద ఒంటరిగా ఉన్న రవికుమార్‌పై భరత్, అతని కుమారుడు సన్ని పదునైన కత్తితో రవికుమార్‌పై దాడి చేశారు. స్థానికులు రవికుమార్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


