కోడి పందేల కేసులో 30 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కోడి పందేల కేసులో 30 మంది అరెస్ట్‌

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి సమీపంలో ఈ నెల 12న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి 39 ద్విచక్ర వాహనాలు, మూడు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం 30 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 9 మందిని త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు. పేకాట, మట్కా, కోడి పందెలు తదితర జూదాలను ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రాక్టర్‌ కింద పడి

హమాలీ మృతి

గుత్తి రూరల్‌: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్‌ జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ కింద పడి దూదేకుల మౌలాలి (45) మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి వెంకటాంపల్లికి చెందిన దూదేకుల మౌలాలి ట్రాక్టర్‌కు హమాలిగా వెళ్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి శివారులో ట్రాక్టర్‌లో ఎర్ర మట్టి లోడ్‌ చేసుకుని జి.వెంకటాంపల్లికి వెళ్తున్నారు. అయితే కొత్తపేట శివారులోని బైపాస్‌ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్‌ వెళ్తుండగా కుదుపులకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ పక్కన కూర్చున్న మౌలాలి చేయి పట్టు జారి వెనుక చక్రం కింద పడ్డాడు. ట్రాక్టర్‌ ట్రాలీ అతడిపై నుంచి ఎక్కి వెళ్లడంతో మౌలాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లాలుబీ, కుమార్తె రేష్మా, కుమారుడు మహమ్మద్‌ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10 ఎకరాల్లో అరటి తోట దగ్ధం

కూడేరు: ఓ రైతు తన పొలంలో చెత్తాచెదారానికి నిప్పు పెట్టడంతో ఆ మంటలు గాలికి పక్కనే ఉన్న ముగ్గురు రైతులకు చెందిన అరటి తోటకు వ్యాపించాయి. అరటి చెట్లు, డ్రిప్‌ పైపులు, పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలు.. కూడేరు మండలం కడదరకుంటలో వెంకటనాయుడు రెండున్నర ఎకరాల్లో , శ్రీలత 6 ఎకరాల్లో, నరేంద్ర ఒకటిన్నర ఎకరాల్లో అరటి తోట సాగు చేశారు. ప్రస్తుతం ఏడాదిన్నర చెట్లు. పక్క రైతు పొలంలో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. గమనించిన రైతులు వెంటనే ఫైరింజన్‌కు సమాచారమిచ్చారు. ఫైరింజన్‌ వచ్చే లోపు మంటలకు అరటి చెట్లు , డ్రిప్‌ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10 లక్షలు వరకూ నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

పోలీసుల అదుపులో

చైన్‌ స్నాచర్స్‌

తాడిపత్రిటౌన్‌: పట్టణంలో రెండు రోజుల క్రితం గాంధీకట్ట వద్ద ఇద్దరు చైన్‌స్నాచర్స్‌ మహిళ మెడలో గొలుసులాక్కోని వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ ఇద్దరు గతంలో ఎక్కడెక్కడ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

కడదరకుంటలో పూర్తిగా కాలిపోయిన అరటి తోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement