అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 520 అర్జీలు అందాయి. ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్‌తో పాటు జేసీ సి.విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్‌రెడ్డి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలకు సంబంధించి 189 అర్జీలు, ఇతర సమస్యలపై 331 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌కు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ విన్నవించారు. విద్యార్థులకు సకాలంలో కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులపై కౌంటర్ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్‌కు ఎస్సీ, ఎస్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేరిమెట్ల ఎల్లన్న విన్నవించారు. మొహర్రం సందర్భంగా పీసీ కొత్తకోట, అనకానహళ్, ఆకులేడు, నడిమిదొడ్డి తదితర గ్రామాల్లో దళితులపై దాడులు జరిగాయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు తిరిగి బాధితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరారు.


