హిందూపురం చేరిన రవితేజ మృతదేహం | - | Sakshi
Sakshi News home page

హిందూపురం చేరిన రవితేజ మృతదేహం

Jul 15 2026 1:34 AM | Updated on Jul 15 2026 1:34 AM

హిందూపురం: వియత్నం బోటు ప్రమాదంలో మృతిచెందిన హిందూపురం వాసి, లక్కీ సెల్‌ పాయింట్‌ యజమాని రవితేజ మృతదేహాన్ని లావా సంస్థ ప్రతినిధులు బంధువులకు మంగళవారం అప్పగించారు. మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. రవితేజ లావా సంస్థ ప్రతినిధిగా గత పదేళ్లుగా లక్కీ మొబైల్‌ షాప్‌ నడుపుతూ లావా సెల్‌ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. లావా సెల్‌ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ అయిన రవితేజ సెల్‌ఫోన్లు విక్రయాలు లక్ష్యాన్ని అధిగమించడంతో విదేశీ పర్యటనకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని 75 మంది డిస్ట్రిబూటర్లను ఎంపిక చేసి, వియత్నాం దేశానికి తీసుకెళ్లారు. ఈనెల 8న హిందూపురం నుంచి వియత్నాం బయల్దేరి వెళ్లిన రవితేజ 9న వియత్నాం సముద్రం దాటుతూ బోటు బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు. వియత్నాం నుంచి మృతదేహాన్ని ముంబాయి చేరడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో కంపెనీ ప్రతినిధులు, బంధువులు అంబులెన్స్‌లో హిందూపురంలోని టీచర్స్‌కాలనీలోని వారి నివాసానికి తీసుకొచ్చారు.

మిన్నంటిన రోదనలు.. : అంబులెన్స్‌ నుంచి శవపేటికను దించగానే రవితేజ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. అందరితో మంచి సఖ్యతగా ఉండే రవితేజ మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. రవితేజకు తల్లితో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లావా సంస్థ రవితేజ కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తండ్రి మృతదేహాన్ని చూడగానే పెద్ద కుమారై సహస్త్ర కన్నీరుమున్నీరవుతూ ‘ నాన్నా..చూడు నేను మంచి పెయింటింగ్‌ వేశాను.. చూడు నాన్నా’ అంటూ విలపించడం స్థానికులను కలచివేసింది.

గుర్తు తెలియని వృద్ధుడి శవం లభ్యం

విడపనకల్లు: హంచనహాల్‌ సమీపంలో మంగళవారం 63వ జాతీయ రహదారి పక్కన జీబీసీ ప్రధాన కెనాల్‌ వద్ద వృద్ధుడి శవం లభ్యమైంది. రోడ్డు పక్కన గుంతకల్లు బ్రాంచి ప్రధాన కాలువ పక్కన ముళ్ల పొదల మధ్య పడి ఉన్న వృద్ధుడి శవాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. విడపనకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు శవాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనాథ శవంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అశ్వత్థంలో

20న బహిరంగ వేలం

పెద్దపప్పూరు: మండలంలోని అశ్వత్థ నారాయణ క్షేత్రంలో ఈనెల 20న టెంకాయల విక్రయం, కొబ్బరిచిప్పల పోగుచేసుకొను హక్కు కోసం బహిరంగ వేలం పాట ఉంటుందని ఈఓ సుబ్రమణ్యం, పాలకమండలి సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాఘమాసం మినహా విడి దినాల్లో మాత్రమే ఈ షరతు వర్తిస్తుందన్నారు. వేలంలో పాల్గొనేవారు టెంకాయల విక్రయానికి రూ.50 వేలు, కొబ్బరి చిప్పల పోగు చేసుకునేందుకు రూ.లక్ష డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

పారిశుధ్య కార్మికుడి

కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్‌: పారిశుధ్య కార్మికుడి మృతి కేసులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఉత్తర్వులను జీహెచ్‌ఎంసీ అమలు చేసింది. మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశామని, అర్హతలను బట్టి అతడి కుటుంబ సభ్యులు ఇద్దరికి ఉద్యోగాలిస్తామని జీహెచ్‌ఎంసీ మంగళవారం కమిషన్‌కు నివేదిక అందజేసింది. ప్రమాదాలు పునరావృతం కాకుండా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. తదుపరి విచారణ అవసరం లేదని కమిషన్‌ భావించి కేసును కొట్టేసింది.

అసలేం జరిగిందంటే..?

గుత్తి మండలం ఇస్సరాలపల్లికి చెందిన మీసాల సుధాకర్‌(40) కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ కమాన్‌ వద్ద నివసిస్తూ చెత్త సేకరణతో జీవనం సాగిస్తున్నాడు. జనవరి 24న ఉదయం 5.15 గంటల సమయంలో ఆటోలో సేకరించిన చెత్తను యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌కు తీసుకెళ్లి ప్రమాదవశాత్తూ ర్యాంపులో పడి మృతి చెందాడు. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, సభ్యులు శివాది ప్రవీణ, బి.కిశోర్‌తో కూడిన బెంచ్‌ సుమోటోగా కేసును స్వీకరించి విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ సభ్యులకు రెండు ఉద్యోగాలు కల్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

వియత్నాం విహార యాత్రకు వెళ్లి బోటు మునిగి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement