వజ్రకరూరు: కొనకొండ్ల శివారులో ఇద్దరు అంతరాష్ట్ర చైన్‌స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు బంగారు తాళిబొట్లు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఉరవకొండ సీఐ మహానంది విలేకరులతో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా చిత్తాలి గ్రామానికి చెందిన అమన్‌దీపక్‌రౌత్, కర్ణాటక రాష్ట్రం దార్వాడ్ జిల్లా యారీబూదిహాల్‌కు చెందిన ఆకాష్‌షికారి ఇద్దరూ స్నేహితులు. చెడు వ్యసనాలతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఇటీవల ఆంధ్రకు వచ్చి ఒంటరి మహిళల మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి, వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. రెండు నెలలక్రితం గుంతకల్లులోని ఎన్‌హెచ్ బ్రిడ్జి సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లారు. ఈనెల 9న కమలపాడుకు చెందిన అనిత మార్గంమధ్యలో గూళ్యపాళ్యం వద్ద ద్విచక్రవాహనాన్ని నిలువరించి, బంగారు గొలుసు లాక్కెల్లారు. మంగళవారం మధ్యాహ్నం కొన కొండ్లలోని ఎన్‌హెచ్ 67 ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైన్ స్నాచర్లను అరెస్టు చేసి, వారి నుంచి గుంతకల్లు రూరల్ పీఎస్ పరిధిలోని బంగారు నగలు, ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నగలు విలువ రూ.4.80లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. సమావేశంలో వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, వజ్రకరూరు పోలీసులు ఉన్నారు.


