కణేకల్లు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు పెచ్చుమీరాయని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై చెప్పులతో దాడి చేసిన టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్, భార్య లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై సమన్వయకర్త మెట్టు రాయదుర్గం సీఐ వెంకటరమణతో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి టీడీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య వివరించేందుకు టీడీపీ నేత ఇంటికెళ్లి మార్గమధ్యంలోనే వెనుదిరిగిన వృద్ధుడిని టీడీపీ నాయకుడు దాడి చేయడం హేయమన్నారు. పొలం పనికెళ్లిన వృద్ధుడిని పనిగట్టుకొని టీడీపీకి చెందిన దంపతులు అక్కడికెళ్లి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. నీళ్లు రాకపోతే అడగాలని అనుకోవడం కూడా తప్పాని మెట్టు ప్రశ్నించారు. ప్రశాంతమైన పల్లెలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేసి ప్రజల్లో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మోకా ఆంజనేయుల దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్‌సీపీ తరుపున ఆందోళనలు చేస్తామని మెట్టు హెచ్చరించారు.


