పేదల ఉపాధిపైకి జేసీబీలు | - | Sakshi
Sakshi News home page

పేదల ఉపాధిపైకి జేసీబీలు

Jul 14 2026 1:06 AM | Updated on Jul 14 2026 1:06 AM

అనంతపురం క్రైం: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట రోడ్డుకు ఇరువైపులా ఏళ్లుగా నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారాలను ట్రాఫిక్‌ సమస్య పేరిట నగర పాలక సంస్థ అధికారులు సోమవారం తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఒక్కసారిగా షాపులు తొలగించడంతో తమ కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమైందని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా కొందరు చిరు వ్యాపారులు అధికార పార్టీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ కావాలనే మా దుకాణాలను ఇక్కడి నుంచి తొలగింపజేశారు. మా కడుపులు కొట్టిన తను మట్టి కొట్టుకుపోతాడు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ఇక్కడ కొన్నేళ్లుగా చాలామంది తోపుడుబండ్లు, తాత్కాలిక షెడ్లు, వాహనాల్లో హోటళ్లు, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులతో పాటు నగర వాసులకూ ఇవి ఉపయుక్తంగా ఉండేవి. వీటిని నిర్వహిస్తున్న వారిలో చాలామంది పేదలే. 30–40 ఏళ్లుగా వీటిపైనే ఆధారపడి బతుకుతున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారి పట్ల ఏమాత్రమూ కరుణ చూపకుండా జేసీబీలను తెచ్చి మొత్తం కూల్చేశారు. బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా లెక్క చేయలేదు. తమ దుకాణాలు తొలగించి అధికార పార్టీ వారు షాపులు ఏర్పాటు చేసుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని, దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ఎక్కడ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయో అక్కడ తిష్టవేయడం, వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్‌ చేయడం ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.

అనంతపురం సర్వజనాస్పత్రి ఎదుట చిరు వ్యాపారాల తొలగింపు

ఎమ్మెల్యే దగ్గుపాటి ఇలా చేయించారంటూ బాధితుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement