ట్రాక్టర్‌ ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ప్రత్యక్షం

Jul 14 2026 1:06 AM | Updated on Jul 14 2026 1:06 AM

బ్రహ్మసముద్రం: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మంజూరు చేసిన స్వచ్ఛభారత్‌ ట్రాక్టర్లను సొంతానికి వాడుకోవడమే కాకుండా అమ్మేసిన తీరుపై ‘అమ్ముకుంటాం అడిగేవారెవరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం బ్రహ్మసముద్రం మండలంలో చర్చనీయాంశమైంది. టీడీపీ నాయకుల్లో టెన్షన్‌ పుట్టించింది. ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్న’ చందంగా పిల్లలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత ట్రాక్టర్‌ తన ఇంటి వద్దే ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. ఇన్ని రోజులు గ్రామంలో కనిపించకుండా పోయిన ట్రాక్టర్‌ ఉన్నట్లుండి ప్రత్యక్షం కావడం వెనుక ఆంతర్యం ఏమిటోనంటూ పలువురు ప్రశ్నించారు. సంతేకొండాపురం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ కూడా వీలైనంత త్వరగా ప్రత్యక్షం కావాలని కోరుకున్నారు. అయినా, గ్రామ సచివాలయం ఆవరణంలో ఉండాల్సిన పంచాయతీ ట్రాక్టర్‌ను ఇలా ఇళ్ల వద్ద ఉంచుకోవడం తగదని, అధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

1.57 లక్షల హెక్టార్లలో ‘ప్రత్యామ్నాయం’

24,168 క్వింటాళ్లతో ప్రతిపాదనలు

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ సాగు తగ్గిపోవడంతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలాఖరుకు 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.57 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి 24.168 క్వింటాళ్లు అవసరమని నివేదించారు. అత్యధికంగా ఉలవలు 10,215 క్వింటాళ్లు, కందులు 5,565, పెసలు 2,670, జొన్నలు 2,620, అలసందలు 2,206, ఆముదం 496, కొర్రలు 486 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు.

జిల్లా వైద్యాధికారిగా కట్టా వెంకటేశ్వర్లు

అనంతపురం సిటీ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు సీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉన్న ఈయన్ను డీఎంహెచ్‌ఓగా ఇక్కడికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో పనిచేస్తున్న డాక్టర్‌ ఈ.భ్రమరాంబదేవి వైఎస్సార్‌ కడప జిల్లా సూపర్‌ స్పెషాలిటీ సీఎస్‌ ఆర్‌ఎంఓగా బదిలీ అయ్యారు. అలాగే అనంతపురం జీజీహెచ్‌ సీఎస్‌ ఆర్‌ఎంఓగా తిరుపతి జిల్లా తడా పీహెచ్‌సీ డాక్టర్‌ ఓ. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.

నిరంకుశత్వంపై నిరసన

యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామంలో వీబీజీ–రామ్‌జీ పథకం క్షేత్ర సహాయకుడు రంగస్వామి సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు కూలీలకు పనులు కల్పించని ఎంపీడీఓ, ఏపీఓలే తనను నిరంకుశంగా విధుల నుంచి తప్పించారని ఆరోపించాడు. కుట్ర పూరితంగా వ్యవహరించి తన కుటుంబాన్ని రోడ్డున పడేటట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో పత్రాలు, రికార్డులు పట్టుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. తనను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement