అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ బల్లా పల్లవిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే సిఫారసుతోనే చైర్‌పర్సన్ పదవి దక్కించుకున్న ‘బల్లా’ నెల రోజులు తిరగకనే ఆయనతో విభేదించారు. దీంతో నాలుగు నెలలుగా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత జనవరి 8న చైర్మన్‌గా బల్లా పల్లవి, వైస్ చైర్మన్‌గా హర్షదుల్లాతో పాటు మరో 13 మంది డైరెక్టర్లతో పాలకవర్గం కొలువుదీరింది. 13 మంది డైరెక్టర్లలో ఇరువురు జనసేన, ఒకరు బీజేపీ కాగా మిగతావారు టీడీపీకి చెందిన వారున్నారు. చైర్‌పర్సన్‌గా బల్లా పల్లవి తీసుకుంటున్న నిర్ణయాలు, వైస్‌చైర్మన్, డైరెక్టర్లను పట్టించుకోకపోవడంతో పదవి నుంచి ఎలాగైనా దించాలని ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యార్డులో టెండర్లు, వేయింగ్ కాటా,క్యాంటీన్ నిర్వహణ,కమీషన్ల వ్యవహారం, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చైర్‌పర్సన్ భర్త బల్లా సురేష్‌కు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్రస్థాయిలోనే వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నెలన్నర కిందట వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎమ్మెల్యే పిలిపించుకుని చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా సంతకాలు తీసుకుని పార్టీ అధిష్టానానికి పంపారన్న ప్రచారం జరుగుతోంది.
సమావేశానికి గైర్హాజరు
మార్కెట్ కమిటీ సాధారణ సమావేశాలు మూడు సార్లు కోరం లేక వాయిదా పడితే పాలకవర్గం రద్దుకు సిఫారసు చేయవచ్చని తెలుస్తోంది. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె.గోవిందు ప్రకటించారు. సమావేశానికి చైర్‌పర్సన్ బల్లా పల్లవి మాత్రమే హాజరయ్యారు. గంట పాటు ఎదురుచూసినా వైస్ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఎవరూ రాలేదు. దీంతో కోరం లేక వాయిదా వేస్తున్నామని, త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సెక్రటరీ ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే వారం నిర్వహించే సమావేశానికి కూడా ఎవరూ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలా మూడో సమావేశం కూడా వాయిదా పడితే ఏం చేయాలనే దానిపై మార్కెట్ కమిటీ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. మరోపక్క చైర్‌పర్సన్ బల్లా పల్లవి తగ్గేదేలే.. అంటూ తన దూకుడును కొనసాగిస్తున్నారు. సమావేశానికి వైస్‌చైర్మన్, డైరెక్టర్లు గైర్హాజరైన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కమిటీ సమావేశానికి చైర్‌పర్సన్ బల్లా మినహా మిగతావారు గైర్హాజరు
కోరం లేక వాయిదా వేసినట్లు
సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ గోవిందు వెల్లడి


