● ఉరవకొండ నియోజకవర్గంలో బీఎల్‌ఓలు, టీడీపీ బీఎల్‌ఏల ఇష్టారాజ్యం
● శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లినా ఓట్లు తొలగించని వైనం
ఉరవకొండ: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అధికార టీడీపీ అపహాస్యం చేస్తోంది. ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను ఓ వైపు అక్రమంగా తొలగిస్తూనే.. మరో వైపు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి, ఆ ప్రాంతంలోనే ఓటు వేస్తున్న టీడీపీ మద్దతుదారులను మాత్రం తొలగించడం లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే తంతు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా స్థానిక సచివాలయం–2 పరిధిలో మ్యాపింగ్ కాని ఎన్యుమరేషన్ పత్రాలకు సంబంధించి ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి వీఆర్‌ఓపై ఒత్తిడి తెచ్చి అవి వైఎస్సార్‌సీపీ వారివి కావడంతో డిజిటలైజేషన్ చేయరాదనడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏల ఫిర్యాదులను ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోకుండా బీఎల్‌ఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలోని కొట్టాలపల్లి, తగ్గుపర్తి, కోనాపురంతో పాటు మంత్రి కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పలువురు చాలా ఏళ్ల క్రితమే ఇతర దేశాలు, ప్రాంతాలకు వలస వెళ్లినా ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని తెలిసింది. అర్హులు కాకపోయినా 500కు పైగా టీడీపీ మద్దతుదారుల ఓట్లు ముఖ్యంగా మంత్రి సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లను అలానే ఉంచినట్లు సమాచారం. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు ఈఆర్‌ఓతో పాటు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని కోల్పోవడంతోనే ‘సర్’ మాటున కుతంత్రాలకు పాల్పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.


